తమిళ హాస్య నటుడు వివేక్ తెలుగువారందరికి సుపరిచితుడు. తాజాగా ఆయన హఠాన్మరణం అందరిని తీవ్రమైన షాక్ కు గురి చేసింది. రెండు రోజుల క్రితం వ్యాక్సిన్ వేయించుకొని.. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని నవ్వుతూ చెప్పి.. ప్రజల్ని మోటివేట్ చేసిన అతడు.. రెండు రోజులకే నిర్జీవంగా మారిపోవటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
అతడి మరణం కోలీవుడ్ కు షాకింగ్ గా మారింది. నవ్వుతూ.. ఉత్సాహంగా ఉండే వివేక్ లో మరోకోణం..అతడో గొప్ప ప్రకృతి ప్రేమికుడని చెబుతారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న అతడు.. అందులో భాగంగా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్నిపూర్తి చేశారు. తాజాగా ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ గుర్తు చేశారు.
వివేక్ లక్ష్యాన్ని తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కోటి మొక్కలు నాటే కల నెరవేరకుండానే మరణించటం విచారకరమన్న ఆయన.. అతడి లక్ష్యాన్ని అర్థంతరంగా ఆగిపోకుండా మిగిలిన 68 లక్షల మొక్కల్ని తాను నాటే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అదే వివేక్ కు అసలైన నివాళిగా పేర్కొన్నారు. ఎంపీ సంతోష్ స్పందన పలువురిలో స్ఫూర్తిని రగిలిస్తోంది.