గత ఆదివారం నిర్వహించిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో లాక్ డౌన్ ను పది రోజులకు పొడిగించటం.. ఉదయం 10 గంటల తర్వాత అమలయ్యే లాక్ డౌన్ ను మధ్యాహ్నం 2 గంటల తర్వాత అమలు చేయటం తెలిసిందే.
ప్రభుత్వం పేర్కొన్న గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి లాక్ డౌన్ మాటేమిటి? అదెలా ఉండనుంది? కేసీఆర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లాక్ డౌన్ పై కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
గత కేబినెట్ సమావేశాల సందర్భంగా పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువగా నమోదైతే.. లాక్ డౌన్ ఎత్తేయొచ్చని సీఎం కేసీఆర్ వెల్లడించటం తెలిసిందే. గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణలో పాజిటివిటీ రేటు మూడు శాతం కంటే తక్కువే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ.. కేసుల నమోదు తగ్గుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఇప్పటి మాదిరి కాకుండా.. కొన్ని కీలక మార్పులు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.