తెలంగాణలో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఇప్పటి నుంచే పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ముందస్తు ఎన్నికలు వస్తాయేమోననే ప్రచారంతో బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే ఆ దిశగా తమ కసరత్తులు మొదలెట్టాయి. కేసీఆర్ కూడా బీజేపీని టార్గెట్ చేసి పొలిటికల్ హీట్‌ను పెంచారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బ్రేక్ వేసేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ బండి సంజయ్ పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ తన సొంత జిల్లా కరీంనగర్ స్థానం నుంచి కాకుండా ఆయన వేములవాడ నుంచి పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. గత రెండు శాసనసభ ఎన్నికల్లోనూ ఆయనకు కరీంనగర్ స్థానం కలిసి రాలేదు. పైగా సొంత పార్టీ నాయకులే అక్కడ తనకు వ్యతిరేక వర్గంగా కలిసి రహస్య సమావేశాలు పెట్టారనే సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వేములవాడు అయితే సేఫ్‌గా ఉంటుందని బండి భావిస్తున్నారంటా. అందుకే ఇటీవల ఎక్కువగా ఆ నియోజకవర్గ నేతలతో సమావేశాలవుతున్నారని తెలిసింది. ఆయన పూర్తిగా దానిపైనే ఫోకస్ పెట్టి పర్యటనలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి చెన్నమనేని రమేశ్ ఉన్నారు. మూడు సార్లు ఆయన అక్కడ గెలిచారు. కానీ ఇప్పుడు పౌరసత్వం వివాదం కారణంగా ఆయనకు పదవీ గండం పొంచి ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు చాలా కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆయనకు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సీటు ఇవ్వదనే ప్రచారం సాగుతోంది. దీంతో మిగతా స్థానాలు ఎలా ఉన్నా వేములవాడపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టిందని అర్థమవుతోంది. అక్కడ కొత్త అభ్యర్థి కోసం కేటీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. తన సొంత జిల్లా అయిన సిరిసిల్లాలోనే వేములవాడ ఉండడంతో ఇక్కడ టీఆర్ఎస్ గెలుపు కేటీఆర్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.
అందుకే బలమైన అభ్యర్థి కోసం ఆయన వెతుకుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో సంజయ్‌కు చెక్ పెట్టేందుకు కేటీఆర్ పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. సంజయ్‌ను ఓడించే అభ్యర్థిని కేటీఆర్ పట్టుకుంటే పార్టీకి అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
మరోవైపు మాజీమంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ నేత తుల ఉమ కూడా వేములవాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈటల రాజేందర్ కూడా ఆమెకు బీజేపీ తరపున వేములవాడు సీటు ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బండి సంజయ్ అక్కడి నుంచి బరిలో దిగితే ఉమకు ఛాన్స్ దక్కదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మరి ఎన్నికల సమయం నాటికి ఏం జరుగుతుందో చూడాలి.