తెలంగాణలో కొన్నాళ్లుగా వివాదంగా మారిన ఎమ్మెల్యేల జంపింగుల వ్యవహారంపై తాజాగా సోమవారం.. రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వారి సంగతి మీరే తేల్చండి.. అని స్పీకర్ ప్రసాదరావుకు తేల్చి చెప్పింది. అంతేకాదు.. మీరు తీసుకునే నిర్ణయం సంతృప్తిగా ఉంటే ఓకే.. లేకపోతే.. తామే సుమోటో గా కేసును విచారణకు తీసుకుని అప్పుడు నిర్ణయిస్తాం.. అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తితో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఏంటి విషయం..
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ తరఫున విజయం దక్కించుకున్న కొందరు ఎమ్మె ల్యేలు.. ఈ ఏడాది ప్రారంభంలో కొందరు, పార్లమెంటు ఎన్నికలకు తర్వాత మరికొందరు పార్టీ మారిపో యారు. అధికార పార్టీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా ఎంపీ టికెట్ తెచ్చుకుని పోటీ కూడా చేశారు. మిగిలిన వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి కుమార్తె, తెల్లం వెంకట్రావు సహా మరికొందరు ఉన్నారు.
అయితే.. వీరిని అనర్హులుగా చేయాలని బీఆర్ ఎస్ పార్టీ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాన్నాళ్లు ఎదురు చూసిన బీఆర్ ఎస్.. ఇక, న్యాయ పోరాటానికి దిగింది. గత రెండు నెలల నుంచి ఈ పిటిషన్లపై విచారణ సాగింది. ఇటీవల విచారణ పూర్తయింది. అయితే.. తీర్పునుమాత్రం రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు సోమవారం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.
స్పీకర్ ప్రసాదరావుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఆలోగా సరైన నిర్ణయం తీసుకోకపోతే.. తామే రంగంలోకి దిగుతామని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అయితే.. ఇలాంటి సందర్భాలు కొత్తకాదు. గతంలో మహారాష్ట్రలోనూ ఇదే సందర్భం వచ్చింది. స్పీకర్ నిర్ణయానికే బాంబే హైకోర్టు వదిలేసింది. కానీ, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.