హఫీజ్ పేట కిడ్నాప్ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. హఫీజ్ పేట భూముల విషయంలో వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావు.. సహా మరో ఇద్దరిని కిడ్నాప్ చేశారని అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిలపై కేసు నమోదైంది.
ఈ కేసులో ఏ1గా ఉన్న అఖిల ప్రియకు 17 రోజులు కస్టడీలో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది. ఈ కేసులో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హఫీజ్ పేట భూముల వ్యవహారం, కిడ్నాప్ ఉదంతం సద్దుమణగకముందే…తాజాగా ఆ భూములపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
హఫీజ్‌పేట్ సర్వే నంబరు 80లోని140 ఎకరాలు వక్ఫ్, ప్రభుత్వ భూమి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. సర్వే నెంబరు 80లోని భూమి ప్రైవేట్‌దేనని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు, పిటిషనర్లకు రూ.4 లక్షలు చెల్లించాలని వక్ఫ్ బోర్డు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 50 ఎకరాలను ప్రవీణ్ రావు సహా యజమానుల పేరిట నమోదు చేయాలని సూచించింది.
మరోవైపు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హఫీజ్‌పేట్ భూవివాదంలోనే కిడ్నాప్ అయిన ప్రవీణ్ రావు…కేసీఆర్ బంధువన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా వివాదంలో ఉన్న హఫీజ్ పేట భూముల వ్యవహారంలో హైకోర్టు తీర్పు కీలక మలుపు అని చెప్పవచ్చు.