ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతోపాటు, జగన్, విజయసాయిల బెయిల్ రద్దు పిటిషన్లను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరించింది.
జగన్, విజయసాయిల బెయిల్ రద్దు పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చాలని రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్స్‌పల్ బెంచ్ అనుమతిచ్చింది. దీంతో, తాను దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను ఆ బెంచ్ నుంచి బదిలీ చేయాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. అయితే, విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చిన ఆదేశాలను తీర్పు వెలువడడానికి ముందు ప్రస్తావించడంపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు.
ప్రత్యేక కోర్టు విధించిన షరతులను విజయసాయి ఉల్లంఘించలేదు కాబట్టి మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని అభిప్రాయపడ్డారు. విజయసాయిరెడ్డి విదేశాల్లో పర్యటించేందుకు సీబీఐ కోర్టు అనుమతించినంత మాత్రాన అక్కడి నుంచి పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సహేతుకం కాదన్నారు. మరోవైపు, జగన్, విజయసాయిల బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు ఎలా ఉండబోతోందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.