కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా ప్రభావం విద్యారంగంపై తీవ్రంగా పడింది. గత రెండేళ్లుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో పిల్లల చదువులు చట్టుబండలయిందని చాలామంది తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే, అదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒకవేళ పాఠశాలలు తెరిచినా తమ పిల్లలను పంపాలా? వద్దా అనే డైలమాలో చాలామంది పిల్లల తల్లిదండ్రులున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు తెరవడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతి గృహాలు తెరవొద్దని అక్కడి వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో, రేపటి నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు అనుమతిచ్చిన హైకోర్టు….కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది.
విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై ఇటు తల్లిదండ్రులు, అటు విద్యాసంస్థల మేనేజ్ మెంట్ లను బలవంతం చేయవద్దని, తల్లిదండ్రులనుంచి లిఖిత పూర్వక హామీ తీసుకోవద్దని ఆదేశించింది. ఈ ప్రకారం విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని, అలా హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులా లేక ఆన్ లైన్ విద్యాబోధనా అన్న విషయంపై విద్యా సంస్థలకు నిర్ణయాధికారం వదిలేయాలని పేర్కొంది.
అయితే, ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారంలోపు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది. వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత కొనసాగుతోందని, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అయితే, విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలున్నాయని, ప్రభుత్వం ఈ రెండింటిని సమన్వయం చేసి చూడాలని హైకోర్టు అభిప్రాయపడింది.