అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పట్టువదలని విక్రమార్కుడిలా ముప్పుతిప్పలు పెడుతోన్న సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ తీవ్ర స్థాయిలో పోరాడిన రఘురామ…జగన్ అక్రమాస్తులపై పూర్తి స్థాయి దర్యాపునకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ అక్రమాస్తులపై సీబీఐ, ఈడీ అసమగ్రంగా దర్యాప్తు చేశాయని ఆరోపించారు.
అయితే రఘురామ పిటిషన్ ను విచారణకు స్వీకరించడానికి హైకోర్టు కార్యాలయం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే తాజాగా ఆ అభ్యంతరాలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు…కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్ కు నెంబరు కేటాయించాలని, వాదనలను వినకుండా ఉత్తర్వులెలా జారీ చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ పిల్ పై హైకోర్టు రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో, జగన్ పై ఆర్ఆర్ఆర్ మరోసారి విజయం సాధించినట్లయింది.
మరోవైపు, ఏపీ పోలీసులు తనపై నిఘా పెట్టారని రఘురామ ఇచ్చిన ప్రివిలైజ్ నోటీసుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. హైదరాబాద్లోని తన నివాసం వద్ద ఏపీ సీఐడీ విభాగం నిఘా పెట్టిందని ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో, అందుకు సంబంధించిన నివేదిక తెప్పించాలని కేంద్ర హోంశాఖను ఓం బిర్లా ఆదేశించారు. 15 రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.