తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత వ్యాఖ్యలు, వ్యవహారాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన శ్రీనివాసరావు తీవ్ర విమర్శలపాలయ్యారు. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏసు క్రీస్తు వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా ప్రభావం తగ్గిందని, మనం చేసిన సేవల వల్ల కాదని ఆయన వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఇక, భారత దేశానికి ఆధునిక వైద్యాన్ని, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందిందని, క్రైస్తవులు లేకపోతే ప్రపంచ దేశాల్లో భారత్ మనుగడ సాగించేది కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
“మనం అందించిన సేవలతో కాదు… ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గింది. మంచిని ఆచరించాలని, మంచిని ప్రేమించాలని, మంచిని గౌరవించాలని చెప్పే మిగిలిన అన్ని జాతుల, ధర్మాల ప్రబోధాలను మనందరం ముందుకు తీసుకుపోవడం వల్ల మానవజాతిని కాపాడుకోగలిగాం. మనిషిగా పుట్టేందుకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు’ అని శ్రీనివాసరావు అన్నారు.
ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో శ్రీనివాసరావు స్పందించారు. అయితే, తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన అన్నారు. తన ప్రసంగంలో కొంత భాగాన్ని కట్ చేసి వివాదాన్ని సృష్టించాయని అసహనం వ్యక్తం చేశారు. దీన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ చొరవ, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంపూర్ణ సహకారం, ఇతర శాఖల మద్దతుతోనే కరోనాను నియంత్రించగలిగామని తెలిపారు.