కోటి రతనాల వీణ… మా తెలంగాణ.. నినాదంతో ఊరూవాడా పులకించిన తెలంగాణకు స్వేచ్ఛా ఊపిరులు అందిన రోజు సెప్టెంబరు 17. ఈ రోజు మిగిలిన ప్రపంచానికి ఒక సాధారణ రోజే కావొచ్చు. క్యాలెండర్లో వచ్చిపోయే మామూలు సాదాసీదా డేటే కావొచ్చు. కానీ, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు మాత్రం చాలా చాలా ప్రత్యేకమైన రోజు. చరిత్రను తిరగరాసిన రోజు.. రాష్ట్రానికి స్వేచ్ఛా ఊపిరులు అందిన రోజు.
ఎందుకీ ప్రత్యేకం..?
తెలంగాణ చరిత్ర.. ఆసేతు హిమాచలానికీ తెలిసిందే. బ్రిటీష్ పాలకుల నుంచి భారత దేశానికి స్వతంత్రం వచ్చినా.. తెలంగాణ వంటి కొన్ని ప్రాంతాలకు మాత్రం రాలేదు. దీనికి కారణం.. ఇవన్నీ.. సంస్థానాలుగా ఉండడమే. అంటే…బ్రిటీషర్ల ఏలుబడిలో వారి కనుసన్నల్లో మెలుగుతూ.. తమ పాలనను సాగించిన మకుటంలేని మహారాజులు ఈ సంస్థానాలను ఏలారు. ఇలాంటివాటికి కర్త,కర్మ, క్రియ అన్నీ సంస్థానాధీశులే కావడం గమనార్హం.
ఇలా తెలంగాణ నిజాం పాలనలో ఉండేది. ఇలాగే 562పైగా సంస్థానాలు ఉండగా, అవన్నీ 1947, ఆగస్టు 15 స్వాతంత్య్రం అనంతరం భారత్లో కలిసినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం కలవలేదు. స్వతంత్రంగా ఉండటానికి నిజాం మొగ్గుచూపడంతో ఇక్కడ ప్రథమ నిజాం ఉస్మాన్ అలీఖాన్ పాలనే సాగింది. అయితే.. నిజాం పాలనలో అడుగడుగునా విధించిన ఆంక్షల చట్రం ప్రజలను అనేక అగచాట్లకు గురి చేసింది.
అదేసమయంలో పన్నుల వసూలు సహా ప్రజలపై రజాకార్ల ఆగడాలు శ్రుతిమించాయి. దీంతో నిజాం రాజరిక పాలన నుంచి విముక్తి కావాలని, భారత్లో విలీనం చేయాలనే ఆకాంక్ష పెరిగింది. 1947 సెప్టెంబరు నుంచే కమ్యూనిస్టుల నేతృత్వంలో సాయుధ రైతాంగ పోరాటం మొదలై.. ఊరూవాడా సాగి.. చాకలి ఐలమ్మ సాహసోపేత ఘటనలు తెలంగాణలో ప్రత్యేక ఉద్యమానికి ప్రాతిపదికగా మారాయి. ఈ క్రమంలోనే దేశ్ముఖ్లు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి.
అయినప్పటికీ.. నిజాం తన పోకడలను మార్చుకోలేదు. ఈ క్రమంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం 1948 సెప్టెంబరు 12న పోలీసు చర్యకు దిగేందుకు రెడీ అయింది. ఆపరేషన్ పోలో మొదలైంది. సైన్యానికి జనం మద్దతు పెరిగింది. దీంతో సెప్టెంబరు 17న నిజాం ప్రధాన మంత్రి లాయిక్ అలీ రాజీనామా చేశాడు. రజాకార్ల నాయకుడు ఖాసీం రిజ్వీ పరారయ్యారు. ఇక, అప్పటి నుంచి తెలంగాణ కూడా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా స్వేచ్చా వాయువులు పీల్చుకుంది. అందుకే తెలంగాణకు సెప్టెంబరు 17 ఒక ప్రత్యేకం.. ఒక స్వాతంత్య్రం కూడా!!