తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజా గాయకుడిగా కోట్లాదిమంది మన్ననలు పొందిన గద్దర్ హఠాన్మరణం చెందారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ ఈరోజు పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న గద్దర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈరోజు ఉదయం ఆయనకు ఒక్కసారిగా బీపీ పెరిగిపోవడంతో పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. గద్దర్ హఠాన్మరణంపై పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1949లో తెలంగాణలోని మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో గద్దర్ జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును గద్దర్ సంపాదించుకున్నారు. తన పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణలోని ప్రతి పల్లెలో గద్దర్ గజ్జె కట్టి ఆడారు. 1975లో కెనరా బ్యాంక్లో పనిచేసిన గద్దర్ ఆ తర్వాత ఉద్యమంలో పనిచేసేందుకు 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న కారంచేడులో దళితుల ఊచకోతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు.
ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలలో గద్దర్ పాల్గొని పోలీసుల తూటాలకు ఎదురు నిలిచారు. ఇప్పటికీ గద్దర్ శరీరంలో ఒక తూటా ఉంది. మాభూమి చిత్రంలో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావ్ కొడకో అన్న పాటకు గద్దర్ ఆడి పాడి ప్రాణం పోశారు. గద్దర్ కు భార్య విమల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో చంద్రుడు 2003లో అనారోగ్యంతో చనిపోయారు.