దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం 11:30 అయింది…ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లే జనంతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాలన్నీ బారులు తీరి ఉన్నాయి. అయితే, సమయం 11:30 కాగానే హఠాత్తుగా ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. ఒక్కసారిగా వారంతా జాతీయగీతం జనగణమనను పాడడం మొదలుపెట్టారు.
ఒక్క హైదరాబాదులోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరిగ్గా 11:30 గంటలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు,వ్యాపారస్తులు ఎక్కడి వారు అక్కడే నిలుచొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమం జరగలేదు. దీంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి సీఎం కేసీఆర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
ఈ రకంగా ఒకే సమయంలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాన్ని ఆలపించిన ఘనతను తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. తెలంగాణ మొత్తం ఒక్క సారిగా లక్షలాది గొంతులు ఒకేసారి జాతీయ గీతం ఆలపించి సరికొత్త చరిత్రకు నాంది పలికాయి. కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అబిడ్స్ లో జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. ప్రస్తుతం జాతీయ గీతాలాపనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఆగస్టు 8న ప్రారంభమమై ఆగస్టు 22 వరకు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా రోజుకో కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. జయహో తెలంగాణ, కేసీఆర్ పాలనలో తెలంగాణ సరికొత్త రికార్డ్ సాధించిందని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.