వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అక్కర లేదు. రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు..ఇలా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వేణు స్వామి చాలా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్య, సమంతలు విడిపోతారంటూ వేణు స్వామి చేసిన కామెంట్లు నిజం కావడంతో ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని వేణు స్వామి చెప్పిన జోస్యం నిజం కాలేదు. ఆ తర్వాత వేణు స్వామిపై విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో ఇకపై సినీ, రాజకీయ జోస్యాలు చెప్పనని వేణు స్వామి అన్నారు.
కానీ, మాట తప్పిన వేణు స్వామి నాగ చైతన్య, శోభితల పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి వివాహ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, వేణు స్వామిపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదులు అందగా…విచారణకు రావాలంటూ తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే, విచారణకు హాజరు కాకుండా వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా రెండోసారి వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులిచ్చింది.
నవంబర్ 14న విచారణకు రావాలని పేర్కొంది. వేణుస్వామికి ఇచ్చిన స్టేను కోర్టు ఎత్తివేస్తూ వేణుస్వామిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో తాజాగా వేణుస్వామికి మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ సారి వేణు స్వామి విచారణకు హాజరు కాక తప్పదని తెలుస్తోంది.