ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్న విషయం తెలిసిందే. కోవిడ్ -19 పరిస్థితిని అంచనా వేయడానికి మరియు రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ (lock down) కొనసాగింపు, వేళల సడలింపు పై ఈ కేబినెట్ బేటీలో నిర్ణయం తీసుకుంటుంది.
కరోనావైరస్ ఉదృతి వల్ల పెట్టిన లాక్ డౌన్ టైమింగ్ ను ఇటీవల తగ్గించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. నేటి సమావేశంలో వేళల సడలింపు మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది.
ఇక కరోనాతో పాటు ఈ మీటింగ్ లో మీడియా, ఆరోగ్యం, వ్యవసాయ వ్యవహారాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) తెలిపింది.
మే 31 న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ పొడగింపు సమయం నేటితో ముగియనుంది. రేపటి నుంచి ఏం చేయాలనేది ఈరోజు నిర్ణయం అవుతుంది.
రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో, పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి రాష్ట్ర వైద్య శాఖ తీసుకోవలసిన జాగ్రత్తలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని సిఎంఓ తెలిపింది.