తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గురువారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. వచ్చే ఏడు మాసాల కాలా నికి(ఆగస్టు-మార్చి 2025) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అయితే.. ఈ ఏడు మాసాల కాలానికీ 57వేల 112 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇక, గత బీఆర్ ఎస్ పాలనలో పదేళ్లకు ముందు అంటే తెలంగాణ ఏర్పాటు సమయానికి 75,577 కోట్ల మేరకు మిగులు బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. కానీ, గత పదేళ్ల కాలంలో అప్పుల మయంగా రాష్ట్రం మారిందన్నారు.
మొత్తంగా బీఆర్ ఎస్ పాలనలో 6లక్షల 71 వేల 751 కోట్ల రూపాయల మేరకు అప్పులు చేశారని.. ఈ నిధులను ఏం చేశారో కూడా చెప్పడం కష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నా రు. ఈ క్రమంలోనే 57వేల 112 కోట్ల రూపాయలను అప్పులుగా తీసుకోవాల్సి వస్తోందన్నారు.
ఇవీ బడ్జెట్ కేటాయింపులు
+ తెలంగాణ పూర్తి బడ్జెట్: రూ.2,91,159 కోట్లుగా ఉంది. ఇది.. ఏడు మాసాల కాలానికి ప్రకటించిన మొత్తం.
+ రెవెన్యూ వ్యయం: రూ.2,20,945 కోట్లుగా ఉంది. ఇది వేతనాలు, పింఛన్లు, ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. ఇది భారీ ఎత్తున ఉండడం గమనార్హం. పైగా అసలు బడ్జెట్‌కు రమారమి చేరువలో ఉండడం గమనార్హం.
+ మూలధన వ్యయం: రూ.33,487 కోట్లు. ఇది ఏ రాష్ట్రానికైనా.. దేశానికైనా అత్యంత కీలకం. దీనిని మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఒకప్పుడు మూల ధన వ్యయం ఎక్కువగా ఉండేది. తద్వారా రాష్ట్రాలు అభివృద్ధిలో పరుగులు పెట్టాయి. కానీ. రాను రాను దీనిని అన్ని రాష్ట్రాలూ తగ్గించేసుకుని.. కేంద్రంపై ఆధారపడే పరిస్థితిని తెచ్చుకుంటున్నాయి.
+ పన్ను ఆదాయం: రూ.1,38,181 కోట్లు.. ఇది.. స్థానికంగా వచ్చే వ్యాట్, ఇంటిపన్నులు, రహదారి సెస్సు, మద్యంపై వచ్చే ఆదాయం.. వంటివి కలిసి ఉంటాయి.
+ పన్నేతర ఆదాయం: రూ.35,208 కోట్లుగా చూపించారు. దీనిని వివిధ మార్గాల్లో సేకరిస్తారు.
+ కేంద్రపన్నుల్లో వాటా: రూ.26,216 కోట్లుగా చూపించారు. ఇది ప్రధానంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఇది.. ఒకరకంగా జీఎస్టీలో వాటా. గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చూపిస్తోంది ఒకటి.. కేంద్రం ఇస్తున్నది మరొకటిగా ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.
+ కేంద్రం గ్రాంట్లు: రూ.21,636 కోట్లుగా చూపించారు. కానీ, ఇది దైవాధీనం. మ్యాచింగ్ గ్రాంటు ఇస్తే తప్ప.. కేంద్రంలోని మోడీ సర్కారు ఇవ్వడం లేదన్నది గుర్తించాలి. మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోతే.. ఈ నిధులు రావన్న విషయాన్ని సర్కార్లు దాచి పెడుతుండడం గమనించాలి.