తెలంగాణలో కమలనాథుల ఆధ్వర్యంలో తొందరలోనే రథయాత్రలు మొదలుపెట్టాలని పార్టీ డిసైడ్ అయ్యింది. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో పాదయాత్రలు చేసే కన్నా రథయాత్రలు చేస్తేనే జనాలందరికీ చేరువయ్యే అవకాశాలున్నట్లు ఆలోచించింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ నుండి రథయాత్రల పేరుతో జనాల్లోకి వెళ్ళేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ యాత్రలకు కూడా బీజేపీ చీఫ్ బండిసంజయే నాయకత్వం వహిస్తారు. కాకపోతే ఐదు రథాలు జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళబోతున్నాయి.
రథయాత్రల కోసం పార్టీ తరపున ఇప్పటికే ఐదు రథాలు సిద్ధమవుతున్నాయి. వీటి నిర్మాణం దాదాపు ఒక కొలిక్కి వచ్చేసినట్లే. సిద్ధమవుతున్న ఐదు రథాల్లో ఒకటి ప్రత్యేకంగా బండికి కేటాయించారు. మిగిలిన నాలుగు రథాల్లో పార్టీలోని సీనియర్లు ప్రయాణిస్తారు. రథయాత్రలకు పార్లమెంటు నియోజకవర్గాలను యూనిట్లుగా తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రథయాత్రలు సాగాలని పార్టీ డిసైడ్ చేసింది.
రథయాత్రలు జరగబోయే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల రూట్ మ్యాప్ రెడీ అవుతున్నది. బండి ఆధ్వర్యంలో ఇప్పటికి ఐదు సార్లు ప్రజా సంగ్రామ యాత్రలు జరిగాయి. ఈ ఐదుయాత్రలు కూడా దాదాపు పాదయాత్రల్లాగనే జరిగాయి. ఆరోసారి పాదయాత్రకు బండి సిద్ధమవుతున్న దశలో పార్టీ అగ్రనేతలు వద్దన్నారట. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో పాదయాత్రలు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ మంది జనాలను కలుసుకోవడం సాధ్యం కాదని చెప్పారట. అందుకనే పాదయాత్ర స్థానంలో రథయాత్ర డిసైడ్ అయ్యింది.
ఈ రథయాత్ర కూడా బండి మాత్రమే చేయటం కాకుండా వీలైనంతమంది సీనియర్లను ఇన్వాల్వ్ చేయాలని అగ్రనేతలు అనుకున్నారట. అందుకనే ఒక రథంలో బండి మిగిలిన నాలుగు రథాల్లో సీనియర్లు పాల్గొనేట్లుగా యాత్రలను డిజైన్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర చేశారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణాలో ఇపుడే రథయాత్రలు రెడీ అవుతున్నాయి. ఏదేమైనా, యాత్ర పేరేదైనా ప్రజల్లోకి వెళ్ళటమే టార్గెట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు చేసిన ప్రజాసంగ్రాయయాత్రలు, తొందరలో చేయబోయే పాదయాత్రలు ప్రజలపై ఏమేరకు ప్రభావాన్ని చూపించాయనే విషయం వచ్చేఎన్నికల్లో కానీ తేలదు. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.