వివిధ కేసులలో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ దాదాపు రెండున్నర నెలలపాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేశారన్న ఆరోపణతోపాటు మల్లన్నపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే, మల్లన్నపై కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందుకు వచ్చిన మల్లన్న..షాకింగ్ కామెంట్లు చేశారు. తనను హత్య చేయడానికి అధికార పార్టీ భారీ కుట్ర పన్నిందని మల్లన్న చేసిన ఆరోపణలు తెలంగాణలో పెను దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్ తనను అనేక ఇబ్బందులకు గురిచేసిందని, లేనిపోని కేసులు పెట్టించి 74 రోజులు జైలుకు పంపిందని ఆరోపించారు. అక్టోబరు 2న గాంధీ జయంతినాడు తనను జైలులో పాత నేరస్థులతో చంపించాలని కుట్ర పన్నిందని షాకింగ్ ఆరోపణలు చేశారు.
అయితే, ఆ హత్య కుట్రనుంచి తాను చాకచక్యంగా తప్పించుకున్నానని అన్నారు. ఆ తర్వాతి రోజు తనను చీకటి గదిలో బంధించి ఎర్రగడ్డలోని మానసిక రోగులకు ఇచ్చే మత్తుమందు మాత్రలు ఇచ్చి పిచ్చివాడిని చేయాలని ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. జైలు నుంచి తనను బయటకు తీసుకురావడానికి బలమైన, బయటి వ్యక్తులతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. తన టీం సభ్యులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.
కొత్త పార్టీ పెట్టడం, ఇతర పార్టీలకు బయట నుంచి మద్దతివ్వడం, పాత పద్ధతిలోనే కొనసాగడం, ఇతర పార్టీలో చేరడం వంటి 4 అంశాలపై జిల్లా కన్వీనర్లు, కో-కన్వీనర్లతో అభిప్రాయ సేకరణ చేపట్టామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలో అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణ్ణయాన్ని తీసుకుంటామని అన్నారు.తాను జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన వారందరికీ, తన టీం సభ్యులకు మల్లన్న ధన్యవాదాలు తెలిపారు.