సందేహాలు తీరిపోయాయి. అనుమానాలు ఒక కొలిక్కి వచ్చారు. మీడియా ప్రభ అంతకంతకూ తగ్గిపోతూ.. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవమే కాదు.. రాజకీయ మార్పులకు తెర తీస్తుందన్న స్పష్టమైన సందేశాన్ని తాజాగా ఫలితం వెల్లడైన నల్గొండ.. వరంగల్.. ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక స్పష్టం చేసిందని చెప్పాలి. ఇప్పటివరకు మీడియా ప్రభావం గురించి తెలిసిన తెలుగు ప్రజలకు.. సోషల్ మీడియా దెబ్బకు పెద్ద పెద్ద తోపు నేతలు సైతం పక్కకు వెళ్లిపోవటమే కాదు.. రాజకీయ సంచలనంగా మారొచ్చన్న విషయాన్ని తీన్మార్ మల్లన్న ఉదంతం స్పష్టం చేసిందని చెప్పాలి.
నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నిలవటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే.. ఆయన పోటీ పడింది మామూలు వ్యక్తులతో కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన కోదండం మాష్టారును దాటి మరీ ఓట్లు సాధించటంతో మల్లన్న ఓవర్ నైట్ రాజకీయ సంచలనంగా మారారు.
గతంలోనూ ఆయన ఎన్నికల్లో నిలిచినప్పటికీ.. ఎప్పుడూ కూడా ఇంత ప్రభావాన్ని చూపించలేదు. దీనికి కారణం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుల్ని నిత్యం నిలదీయటమే కాదు.. అచ్చం సారు మాదిరే.. ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడేయటం.. అది కూడా కేసీఆర్ ఉపయోగించిన పదాల్ని మాత్రమే వాడటం మల్లన్న స్పెషాలిటీ. ఇదిలా ఉంటే.. మల్లన్న త్వరలో రాజకీయ పార్టీ పెడతారని.. బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. అలాంటి ఉద్దేశాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. మరోసారి ఇదే విషయాన్ని తేల్చేశారు.
నాగార్జున సాగర్ ఎన్నికల్లో తాను పోటీ చేయలేదని.. కాకుంటే తెలంగాణ వ్యాప్తంగా 6వేల కి.మీ. పాదయాత్రను చేపడతానని చెప్పారు. తీన్మార్ మల్లన్న టీం పేరుతో రాష్ట్ర.. జిల్లా.. నియోజకవర్గ.. మండల స్థాయిలో కమిటీల్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశానికి భారీగా మల్లన్న అనుచరులు హాజరు కావటం విశేషం.