సీనియర్ జర్నలిస్ట్ చింతపండు నవీన్ అంటే తెలంగాణలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, తీన్మార్ మల్లన్న అన్న పేరు దాదాపుగా తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. గతంలో తన తీన్మార్ వార్తలతో ప్రేక్షకులను, అభిమానులను సంపాదించుకున్న మల్లన్న…ఆ తర్వాత ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ కుటుంబం, కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేయడంతో శత్రువులను సంపాదించుకున్నాడు. కొంతకాలంగా కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారిన మల్లన్న….74 రోజులుగా జైల్లో మగ్గిపోయాడు.
రకరకాల కేసులలో అరెస్టయిన తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు ఈ రోజు బెయిల్ లభించింది. అసలింతకీ, తీన్మార్ మల్లన్నపై ఒకేసారి అన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయి? నిజంగా తీన్మార్ మల్లన్న మోసగాడైతే ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నవారంతా పొలోమంటూ…పోలీస్ స్టేషన్ల ముందు క్యూకట్టి మరీ కేసులు ఎందుకు పెట్టారు? మల్లన్నపై కేసీఆర్ సర్కార్ కక్ష సాధిస్తోందన్న మల్లన్న అభిమానులు, విపక్ష నేతల మాటల్లో వాస్తవమెంత?
మల్లన్నపై కేసుల్లో హైకోర్టు ఏం చెప్పింది?
తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు మొత్తం 38 కేసులు నమోదయ్యాయి. వాటిలో 6 కేసులను ఈరోజు కొట్టివేసిన హైకోర్టు…మిగతా 32 కేసులలో బెయిల్ మంజూరు చేసింది. చాలాకాలంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే మల్లన్నపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నది ఆరోపణ. ఒకే విధమైన అభియోగాలతో ఇన్ని కేసులు నమోదు చేయటమా? అంటూ మల్లన్నపై కేసుల విషయంలో హైకోర్టుక కూడా విస్మయాన్ని వ్యక్తం చేసిందంటే ఆ కేసుల్లో పస ఎంత ఉందన్నది అర్థమవుతోంది.
ఇక, రాష్ట్ర డీజీపీ ఈ కేసు వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, డీజీపీ వ్యక్తిగతంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్వోలను ఆదేశించాలని, దర్యాప్తు న్యాయబద్ధంగా.. పారదర్శకంగా జరపాలని కూడా కోర్టు చెప్పిందంటే విచారణ ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, సెక్షన్ 41 ఎ కింద దర్యాప్తు అధికారులు మల్లన్నకు నోటీసులు కూడా జారీ చేయకపోవడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది.
ఇక, పీటీ వారెంట్, వారెంట్ ఇష్యూ అయిన సమాచారాన్ని నవీన్ కు కానీ ఆయన సతీమణికి ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇక, ప్రతీకారం తీర్చుకునేలా తెలంగాణ పోలీసులు వ్యవహరించరాదని కోర్టు ప్రత్యేకంగా చెప్పిందంటే మల్లన్న అరెస్టు వ్యవహారంలో పోలీసుల తీరేమిటో తేటతెల్లమవుతోంది. ఇక, మల్లన్నపై కేసుల వ్యవహారంలో జాతీయ బీసీ కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
ఇంతకీ మల్లన్న చేసిన తప్పేంటి?
తన యూట్యూబ్ న్యూస్ చానల్ క్యూ న్యూస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేయడమే మల్లన్న చేసిన తప్పన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంతోనే మల్లన్నపై బెదిరింపులు, బ్లాక్మెయిల్ తదితర ఆరోపణల కింద 38 కేసులు కొద్ది రోజుల వ్యవధిలోనే నమోదయ్యాయని మల్లన్న మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ మల్లన్నపై ప్రభుత్వం కక్ష కట్టి నమోదు చేసిన కేసులని వారు అంటున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి పోటీగా బరిలోకి దిగిన మల్లన్న గట్టి పోటీనిచ్చారు. జర్నలిస్టుగానే కాదు, రాజకీయంగానూ కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో చాలావరకు సక్సెస్ అయ్యారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఇక, తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని మల్లన్న ప్రకటించారు. మల్లన్న పాదయాత్ర చేస్తే…మరింత పాపులర్ అవుతాడని, అందుకే రకరకాల కేసులు పెట్టి అరెస్ట్ చేయించారన్నది ఆయన మద్దతుదారుల ఆరోపణ.
మల్లన్నపై మరో కుట్ర జరుగుతోందా?
మల్లన్న నేడు బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే, మల్లన్న అన్యాయంగా అరెస్టయ్యారన్న సింపతీ జనాల్లో ఉంది. దీంతో, మల్లన్నకు సపోర్ట్ పెరిగిపోతుండటంతో ఆయనపై మరిన్ని కేసులు పెట్టించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ రోజులు జైలులో ఉంచేలా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మల్లన్న టీమ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొనేందకు త్వరలో మల్లన్న బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మల్లన్న ఏం చెప్పబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.