ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ తేనెలోనే ఉందని నమ్మే వారు ఇవాల్టి రోజున భారీగా ఉన్నారు. అందుకు తగ్గట్లే.. దాని వినియోగం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఐదేళ్ల నాటి తేనె వినియోగం.. ఇవాల్టి రోజున వినియోగించే తీరు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. మార్కెట్ ఎక్కువ ఉండి.. ఆదాయానికి అవకాశం ఉన్నంతనే కంపెనీలు రావటం.. కార్పొరేట్లు పాగా వేయటం మామూలే. ఇంతవరకు బాగానే ఉన్నా.. వ్యాపారంలో కీలకమైన లాభం కోసం అడ్డగోలు వ్యవహారాల్ని తెలివిగా తీసుకొచ్చే దుర్మార్గాన్ని బయటపెట్టటం అంత తేలికైన విషయం కాదు.
అయితే.. ఆ ఇష్యూను టేకప్ చేసిన శాస్త్ర.. పర్యావరణ కేంద్రం (సీఎస్ఈ) తేనె కంపెనీల లోగుట్టును బయటపెట్టేసింది. మార్కెట్లో లభించే పదమూడు ప్రముఖ బ్రాండ్ల తేనెను తీసుకొని పరీక్షలు జరిపినప్పుడు అంతా బాగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. మరోవైపు.. తేనెను ఉత్పత్తి చేసే వారి బతుకులు సరిగా లేకపోవటం.. ఆదాయం కోసం వారు పడుతున్న తిప్పలు చూసిన తర్వాత.. ఈ సంస్థ వారికి కొత్త సందేహం కలిగింది. తేనె వినియోగం ఇంత భారీగా పెరిగి.. పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్నప్పుడు.. తేనెను ఉత్పత్తి చేసే వారికి ఇబ్బందులు ఎందుకు? అన్న ప్రశ్నతో మొదలైన వెతుకులాట.. వారికి కొత్త సందేహాలు కలిగేలా చేశాయి.
తేనె నాణ్యతలో సందేహాల్ని తీర్చుకోవటానికి నాణ్యత పరీక్షల్ని నిర్వహించారు. వందల కోట్లు పెట్టుబడి పెట్టే కార్పొరేట్ పెద్దలు.. తమ తప్పుల్ని సింఫుల్ గా దొరికిపోయేలా ప్లాన్ చేయరు కదా? అందుకే.. సీఎస్ఈ సంస్థకు తేనె కంపెనీల లోగుట్టును బయటకు తీసుకురావటానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగశాలలో తేనె నాణ్యత పరీక్షల్ని నిర్వహించారు. ఇందుకోసం చాలా కష్టమైన న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ స్పెక్ట్ట్రోస్కోపీ పరీక్షను జర్మనీలో చేయించారు.
దీంతో.. కంపెనీల భాగోతం బయటకు వచ్చింది. చైనా నుంచి.. దేశీయంగా మరికొన్ని కంపెనీల నుంచి ఫ్రక్టోజ్.. గ్లూకోజ్ తో పాటు ఆల్ పాస్ సిరప్ తో స్వచ్ఛమైన తేనె స్థానంలో వాటిని నిలిపినట్లుగా గుర్తించారు. కిలో రూ.53 నుంచి రూ.68 మధ్యలో ఉన్న రసాయనాన్ని తెలివిగా తేనెలో కలిపేయటం ద్వారా భారీ లాభాలకు తెర తీశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేందుకు సిద్ధమయ్యారు. సంచలనంగా మారిన సీఎస్ఈ సంస్థ రిపోర్టును పలు కంపెనీలు తప్పు పట్టి.. తాము సుద్దపూసలమని చెప్పుకున్నాయి. తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే భారీ కుట్ర జరుగుతున్నట్లుగా పేర్కొన్నాయి.
ఇలాంటివేళ.. సీఎస్ఈ మరోసారి ఓపెన్ అయ్యింది. చైనా కంపెనీలు తాము తయారు చేసే ఫ్ట్రక్టోజ్.. గ్లూకోజ్ ను భారత్ కు ఎగుమతి చేస్తున్న విషయం బహిరంగమేనని.. గత కొన్నేళ్లలో 11వేల టన్నుల సరుకు మన దేశానికివచ్చిందని.. అదంతా ఆన్ లైన్ లో జరుగుతుందని చెప్పింది. రసాయనంతో తేనెను తెలివిగా కల్తీ చేస్తున్న వారి మాటల్లో నిజం.. నేతిబీరలో నేతి లెక్కన అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. మరోసారి.. వాటి బట్టల్ని విప్పదీసేసిందని చెప్పాలి.