బెంగళూరులో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా తడబడింది. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. కివీస్ బౌలర్ హెన్రీ 5 వికెట్లతో, విలియమ్ 4 వికెట్లతో రాణించగా టీమిండియా 46 పరుగులకే కుప్పకూలింది. సొంత గడ్డపై టెస్టుల్లో భారత్ కు ఇదే అత్యల్ప స్కోరు కాగా, ఓవరాల్ గా మూడో అత్యల్ప స్కోర్. తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ, సర్ఫరాజ్, కెఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డక్ ఔట్ అయ్యారు. రిషభ్ పంత్ 20 పరుగులు చేయగా జైస్వాల్ 13 పరుగులు చేశాడు. వర్షం కారణంగా తొలి టెస్ట్ తొలి రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన సంగతి తెలిసిందే.
రెండో రోజు ఆట లంచ్ సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఆదుకుంటాడనుకున్న రిషభ్ పంత్ కూడా అవుట్ కావడంతో భారత్ 46 పరుగులకే చాప చుట్టేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్ కాన్వే 91 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ పై కివీస్ 134 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో అశ్విన్ 1, కుల్దీప్ యాదవ్ 1, జడేజా 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, వర్షం కారణంగా రెండు రోజులుగా పిచ్ కవర్లతో కప్పి ఉన్న నేపథ్యంలో బౌలర్లకు పిచ్ అనుకూలించింది. దీంతో, బెంగుళూరు పిచ్ గురించి, పరిస్థితుల గురించి అంచనా వేయడంలో రోహిత్ విఫలమయ్యాడని, టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకొని ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఈ మ్యాచ్ లో డకౌట్ అయినప్పటికీ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని చేరుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు(536) ఆడిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. ఈ లిస్ట్ లో 535 మ్యాచ్ లు ఆడి రెండో స్థానంలో ఉన్న ధోనీని కోహ్లీ వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు
1. సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్‌లు
2. విరాట్ కోహ్లీ – 536 మ్యాచ్‌లు
3. ఎంఎస్ ధోనీ – 535 మ్యాచ్‌లు
4. రాహుల్ ద్రావిడ్ – 504 మ్యాచ్‌లు
5. రోహిత్ శర్మ – 486 మ్యాచ్‌లు
6. మహమ్మద్ అజారుద్దీన్ – 433 మ్యాచ్‌లు
7. సౌరవ్ గంగూలీ – 421 మ్యాచ్‌లు
8. అనిల్ కుంబ్లే – 401 మ్యాచ్‌లు
9. యువరాజ్ సింగ్ – 399 మ్యాచ్‌లు
10. హర్భజన్ సింగ్ – 365 మ్యాచ్‌లు