టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని రాయుడు ట్వీట్ చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేస్తానని అంబటి రాయుడు అన్నారు. ఈ ప్రకారం తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ కు పంపారు.
అయితే, పార్టీలో చేరిన వారం రోజులలోపే అంబటి రాయుడు వైసీపిని వీడడం సంచలనం రేపుతోంది. అంతకుముందు ‘ఆడుదాం ఆంధ్రా’ ఈవెంట్ సందర్భంగా అన్నీ తానే అని హడావిడి చేసిన అంబటి రాయుడు ఆ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మాత్రం హాజరు కాలేదు. దీంతో, వైసీపీ పెద్దలకు, అంబటి రాయుడికి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ వచ్చింది. అయితే, ఆ తర్వాత వారం రోజులకు జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ పెద్దల తీరు నచ్చకే రాయుడు పార్టీ వీడారని టాక్ వస్తోంది.