కడప జిల్లా.. ఆ కుటుంబానికి పెట్టని కోట. ఆ కుటుంబానికి యావత్ జిల్లా వీరవిధేయతను ప్రదర్శిస్తారు. ఆ కుటుంబం ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలకు సైతం ఆ విషయం సుపరిచితం. దీనికి కారణం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
తన తండ్రి రాజారెడ్డి ఇమేజ్ సంగతి ఎలా ఉన్నా.. తనకున్న ఛరిష్మాతో.. తనకు తానుగా నిర్మించిన కడప కోట వైఎస్ కుటుంబానికి తప్పించి మరెవరికీ చోటు ఉండదన్న పేరును తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు.
ఈ కారణంతోనే ఎన్నిక ఏదైనా సరే.. కడప మాట వచ్చినంతనే వైఎస్ కుటుంబం ఖాతాలో లెక్కేయటం ఒక అలవాటుగా మారింది. వైఎస్ కాంగ్రెస్ లో ఉంటే.. కడప జిల్లా ఆ పార్టీ వెంట ఉంది. ఆయన అనూహ్య మరణం తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా జగన్ వైసీపీని ఏర్పాటు చేసినప్పుడు.. తాము పార్టీకి కాదు వైఎస్ కుటుంబానికి విధేయులం అన్న విషయాన్ని కడప జిల్లా ప్రజలు స్పష్టం చేస్తూ.. క్లియర్ కట్ మెజార్టీతో విజయాన్ని అందించారు.
ఇక.. వైఎస్ కుటుంబం బరిలో దిగే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ పార్టీ అయినా కావొచ్చు.. పులివెందులలో వైఎస్ కుటుంబానికి తప్పించి.. మరెవరికీ ఓటు వేయమని అడిగే పరిస్థితి ఉండదు. ఒకవేళ.. అడిగినా వారు ఓటు వేసేది ఎవరికి అన్న విషయంపై స్పష్టత అన్ని పార్టీల వారికి తెలుసు. అలాంటి పులివెందులలో తొలిసారి.. వైఎస్ కుటుంబానికి కాకుండా.. వేరే పార్టీకి.. వేరే వ్యక్తికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.
ఇదేమైనా అసెంబ్లీ ఎన్నిక? ఇదేమైనా పులివెందుల ప్రజల తీర్పా? ఒక చిన్న సమూహం వేసిన ఓట్లను పట్టుకొని ఇలా కథలు అల్లేస్తారా? అంటూ ప్రశ్నించొచ్చు. కానీ.. దీనికి సమాధానం మాత్రం కాస్తంత వేరుగా ఉందని మాత్రం చెప్పక తప్పదు. నిజమే.. ప్రశ్నలు సంధించేవారికి తగ్గట్లే.. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పులివెందులలో అన్ని వర్గాలకు చెందిన వారు ఓటర్లుగా ఉండరు. కేవలం విద్యావంతులు.. అందునా తమ పేరును ఓటరుగా నమోదు చేసుకున్న వారు మాత్రమే ఉంటారు.
అలా ఉన్న వారు చిన్న సమూహంగా ఉండి ఉండొచ్చు. దశాబ్దాల తరబడి వైఎస్ కుటుంబానికి వీర విధేయతను ప్రదర్శించిన నియోజకవర్గానికి చెందిన ఓటర్లు.. తాజాగా అందుకు భిన్నమైన తీర్పు ఎందుకు ఇచ్చినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. ఇందులో టీడీపీ అభ్యర్థి కష్టం.. ఆయన శ్రమతో పాటు.. మంచి పేరు ఉండటం.. ప్రభుత్వ నిర్ణయాల మీదా.. ముఖ్యమంత్రి మీదా తమకున్న ఆగ్రహాన్ని శాంపిల్ గా చూపించారని చెప్పాలి.
తాజా విజయం మీద తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు పులివెందుల కోటకు పగుళ్లు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని అత్యుత్సాహపు వ్యాఖ్యగా పలువురు అభివర్ణిస్తున్నారు.ఈ వ్యాఖ్యను సాపేక్షంగా చూస్తే..ఒకటి మాత్రం చెప్పొచ్చు. గతంలో మాదిరి పులివెందుల వైఎస్ కుటుంబానికి మాత్రమే కాదన్నది నేటి మాటగా మారిందంటున్నారు. పులివెందుల కోటకు పగుళ్లు లాంటి పెద్ద మాట ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ.. మార్పు అయితే మొదలైందన్న మాటను మాత్రం చెప్పొచ్చు. చరిత్రలో తొలిసారి అన్నట్లుగా పులివెందులలో తెలుగు తమ్ముళ్ల సంతోషాన్ని చూసినప్పుడు కొత్త సన్నివేశం ఆవిష్క్రతమైనందని చెప్పాలి.
వైఎస్ అడ్డా పులివెందులలో పసుపుదళం పొలికేక గట్టిగా వినిపించటమే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారన్న వార్తలు వెలువడిన వెంటనే.. పులివెందుల పూల అంగళ్ల సెంటర్ లో జై తెలుగుదేశం అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. ఇదో కొత్త తరహా అనుభవంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి సన్నివేశాన్ని తమ జీవితకాలంలో ఎప్పుడూ చూడలేదన్న మాట వినిపించటం గమనార్హం. చరిత్ర ఎప్పుడు ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. మరి.. అదెంత వరకు కొనసాగుతుందన్నది రానున్న రోజులు తేలుస్తాయని చెప్పక తప్పదు.