టీడీపీ కీలక నేతల్లో ఒకరైన ఎంపీ కేశినేని నాని కొంతకాలంగా పార్టీపై అలకబూనిన సంగతి తెలిసిందే. బెజవాడ స్థానిక నాయకుల్లో కొంతమందికి, నానికి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే నాని…కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, నాని పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతున్నా…నాని మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు.
మరోవైపు, నాని టికెట్ ను ఈ సారి లగడపాటి రాజగోపాల్ కు ఇవ్వబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలోనూ నాని పార్టీపై గుర్రుగా ఉన్నారని టాక్. ఆ టాక్ అలా ఉండగానే నాని స్థానంలో ఈ సారి టీడీపీ తరఫు నుంచి ఆయన సోదరుడు కేశినేని చిన్ని బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుండడంతో నాని వర్గీయులు తీవ్ర నిరాశతో ఉన్నారు. దీంతో, ప్రస్తుతం బెజవాడలో కేశినేని నాని వర్సెస్ చిన్ని వార్ జరుగుతోంది.
తన ఎంపీ కారు స్టిక్కర్ ను దుర్వినియోగం చేస్తున్నారంటూ విజయవాడ పటమట పోలీసులకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు. చిన్నినే ఆ స్టిక్కర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఆ కంప్లయింట్ తర్వాత చిన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ కేశినేని నానిపై విమర్శలు చేశారు. కేశినేని నాని కుమార్తె వివాహానికి కూడా బాబాయి వరుస అయిన చిన్ని హాజరుకాలేదు.
కేశినేని నాని గత ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో చిన్ని కీలక పాత్ర పోషించారు. నియోజకకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులు, నాని గెలుపు అవకాశాలపై ఆరాలు తీశారు. ఇక, కొంతకాలంగా అన్న నానితో విభేదాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు చిన్ని రెడీ అవుతున్నారట. అందుకే, టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఆల్రెడీ చిన్ని విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు, తనకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన, రాజకీయాలపై ఆసక్తి రెండూ లేవని కేశినేని నాని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో చిన్నికి లైన్ క్లియర్ అయ్యిందని టాక్.
కేశినేని నాని వ్యతిరేక వర్గంతో చిన్ని టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయటంతో పాటు ఎన్నికల్లో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చిన్ని పావులు కదుపుతున్నారట. దీంతో, టీడీపీ బెజవాడ ఎంపీ టికెట్ చిన్నికి కన్ఫర్మ్ అయిందని స్థానిక నేతలు అంటున్నారు.