కమలాపురం.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కీలకమైన నియోజకవర్గం. అంతేకాదు.. ఇది జగన్ మేనమామ(విజయమ్మ తమ్ముడు) రవీంద్రనాథ్‌రెడ్డి సొంత నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ జెండా తప్ప.. గత పదేళ్లలో ఎప్పుడూ టీడీపీ జెండానే కనిపించలేదు. 2014, 2019 ఎన్నికల్లో రవీంద్రనాథ్‌రెడ్డి వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. దీంతో ఇక్కడ వైసీపీ హవానే కొనసాగింది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు వాయు వేగ మనోవేగాలతో మారిపోయాయి. ఫలితంగా వైసీపీ జెండా పీకేసే పరిస్థితి ఏర్పడింది.
ఏం జరిగింది?
కమలాపురం నియోజకవర్గంలో కమలాపురం మునిసిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. వైసీపీ కీలక నేత మునిసిపల్ చైర్మన్‌గా ఉన్నారు. ఇక్కడ గతంలో జరిగిన స్తానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీ విజయందక్కించుకుందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే.. ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. రాజకీయాలు మారిపోయాయి. చైర్మన్ గంధం మోహన్‌బాబు సహా.. కౌన్సిలర్లు.. వైసీపీకి రాం రాం చెప్పారు. నేరుగా టీడీపీ కండువా కప్పుకొన్నారు. కమలాపురంలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి కమలాపురం మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్ లు కమలాపురం శాసనసభ్యుడు పుట్టా చైతన్య రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కమలాపురం గ్రామపంచాయతీగా ఉన్న సమయంలోనే అండర్ డ్రైనేజీని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం నాయకులదని ఎమ్మెల్యే అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండర్ డ్రైనేజీ పనులను ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఉపయోగించుకుందని విమర్శించారు.
అయినప్పటికీ మునిసిపల్ పనులను పూర్తి చేయడంలో చిత్తశుద్ధి ప్రదర్శించలేదని ఎమ్మెల్యే పుట్టా చైతన్య రెడ్డి విమర్శించారు. కమలాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తాను శాయశక్తుల కృషి చేస్తానన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధిని కాకుండా డబ్బు సంపాదించడానికి ప్రయారిటీ ఇచ్చారని అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని చైతన్య రెడ్డి దుయ్యబట్టారు. పార్టీలో చేరిన నాయకులకు ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు.