టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాలను కొద్దిరోజులుగా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగబోతుండగా చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువడనుంది. ఇటువంటి ఉత్కంఠ ఏర్పడిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఈ సమావేశాలకు టీడీపీ సభ్యులు హాజరవుతారా లేదా అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
అయితే సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనక్కు తగ్గేదే లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ప్రభుత్వం ఎంత అవమానించినా ప్రజల కోసం భరించాలని ఎమ్మెల్యేలకు లోకేష్ పిలుపునిచ్చారు. సమావేశాలకు వెళ్లాలా వద్దా అన్న విషయంపై చర్చ జరిపేందుకు టిడిపి ఎమ్మెల్యేలతో లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలకు లోకేష్ దిశా నిర్దేశం చేశారు.
అసెంబ్లీ లోపల, వెలుపల కూడా నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ సీఎం అయిన తర్వాత 2004 నుంచి జగన్ అక్రమార్జన పై అసెంబ్లీలో గలమెత్తుతామని గోరంట్ల చెప్పారు. ఏ ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచారని ధ్వజమెత్తారు. జగన్ చేసిన తప్పులకు జన్మజన్మలకు బాధపడతారని అన్నారు. సొంత డబ్బా కొట్టుకోవడానికి అసెంబ్లీ సమావేశాలను జగన్ పెట్టారని ఎద్దేవా చేశారు.