గత అసెంబ్లీ సమావేశఆల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ చంద్రబాబు ఆనాడు శపథం చేశారు. దీంతో, తాజాగా మార్చి 7 నుంచి జరగబోతోన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అన్నదానిపై టీడీపీ నేతలు తర్జనభర్జనపడుతున్నారు. కొందరు అసెంబ్లీకి వెళ్లి అధికార పక్షం తప్పులను ప్రజలకు తెలియజెప్పాలని అంటున్నారు.
సభలో మైక్ ఇవ్వడం లేదని…ప్రభుత్వాన్ని విమర్శిస్తే మైక్ కట్ చేస్తున్నారని…అటువంటపుడు ప్రేక్షక పాత్ర పోషించేందుకు సభకు వెళ్లడం ఎందుకని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్సీ సమావేశంలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని సభ్యులందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నిర్ణయించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని సభ్యులకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
గతంలో ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని, కానీ, ఆయన తరపున మిగతా సభ్యులు అసెంబ్లీలో పోరాడారని గుర్తు చేశారని తెలుస్తోంది. 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలున్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై పార్టీ పోరాడిందని ఆయన సభ్యులకు హితవుపలికినట్లు తెలుస్తోంది. కాగా, టీడీఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుల మైక్ కట్ చేయాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సభలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సభ నివాళులర్పించనుంది. ఆ తర్వాత సభను వాయిదా వేస్తారు. అనంతరం మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు.