టీడీపీ-కమ్యూనిస్టులు చేతులు కలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్వితీయ ప్రాధాన్య ఓటును పంచుకునేందుకు రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని.. రాష్ట్ర స్థాయిలో నాయకులకు, కార్యకర్తలకు కూడా పార్టీలు స్పష్టం చేశాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలలో టీడీపీకి అనుకూలంగా కమ్యూనిస్టులు వ్యవహరించనున్నారు. అదేసమయంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ విషయంలో కమ్యూనిస్టులకు టీడీపీ సహకరి స్తుంది.
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. జనసేన విషయం మాత్రం ఎటూ తేలలేదు. జనసేన ఎటు వైపు నిలు స్తుంది? ఎలా వ్యవహరిస్తుంది? అనే విషయాలపై ఇంకా సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు.. బీజేపీ తమ పొత్తు జనసేనతోనే అని చెబుతున్నా.. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనను కలుపుకొని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. జనసేన కూడా ఈ విషయంలో మౌనంగానే ఉంది. తాము ఎవరికి మద్దతిస్తున్న విషయాన్నీ స్పష్టం చేయలేదు.
మరో ఆరు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకో నాలుగు రోజుల్లో ప్రచారానికి కూడా తెరపడనుంది. ఈ క్రమంలోనే కమ్యూనిస్టులు టీడీపీతో కలిసినా.. జనసేన మాత్రం ఇంకా పెదవి విప్పకపోవడం.. చూస్తే.. అసలు జనసేన వ్యూహం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన అంతర్గత పొత్తులకు అవకాశం ఇచ్చింది. దీంతో కొన్ని కొన్ని జిల్లాల్లో టీడీపీ-జనసేన కలిసి పంచుకుని.. గెలిచాయి.
అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తూ వచ్చారు. కానీ, ఇప్పు డు ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కమ్యూనిస్టులతో బాబు పొత్తుకు రెడీ అయ్యారు. అయితే.. కమ్యూనిస్టుల ఆశలు వేరేగా ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీతోనే కలిసి ముందుకు సాగాలనేది వారి ప్లాన్. కానీ, ఇప్పటికి గట్టెక్కితే చాలనేది టీడీపీ వ్యూహం. సార్వత్రిక సమరం నాటికి.. బీజేపీతో కలిసి ఉండాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. మొత్తంగా.. ఈ విషయంలో జనసేన మౌనంగా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.