`టార్గెట్ లోకల్` వ్యూహంతో టీడీపీ నేతలు దూసుకుపోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఒకవైపు.. బాబు ష్యూ రిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. `సూపర్ సిక్స్`ను వివరిస్తు న్నారు. ఇదేసయమంలో `టార్గెట్ లోకల్` పేరిట.. స్థానికంగా వైసీపీలో ఉన్న కేడర్‌ను టీడీపీలోకి చేర్చుకునే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ పార్టీకైనా..నాయకులు, కేడర్ చాలా కీలకం. నాయకులు ఉన్నప్పటికీ… క్షేత్రస్థాయిలో కేడర్ కనుక బలంగా లేకపోతే.. జెండా మోసే వారు.. జేజేలు కొట్టేవారు కనిపించడం చాలా కష్టం.
ఇదే వ్యూహాన్ని టీడీపీ సైలెంట్‌గా అమలు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ 5 నుంచి 10 వేల మధ్య కార్యకర్తలను పార్టీలోకి తీసుకువచ్చేలా అంతర్గత వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనిని నాయకులు క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్య చింతమనేని ప్రభాకర్.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. వైసీపీ నుంచి వస్తామని చెబుతున్న కార్యకర్తలకు.. ఎలాంటి భేషజాలు లేకుండా పార్టీ కండువా కప్పేస్తున్నారు. వారికి ఉన్న చిన్నచిన్న సమస్యలను కూడా అక్కడే పరిష్కరిస్తున్నారు. దీంతో పార్టీలో జోష్ పెరిగింది.
ఇక, గురజాల నియోజకవర్గంలోనూ.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కొన్ని రోజులుగా మండల స్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చి చేరతామన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టడం లేదు. అంతేకాదు.. గతంలో టీడీపీలో ఉండి.. అనేక ఒత్తిళ్లతో పార్టీ మారి వైసీపీలోకి చేరిన వారిని ప్రత్యేకంగా పిలిచి.. అభయం ఇస్తున్నారు. పార్టీలో చేర్చుకుని కండువా కప్పుతున్నారు. విజయవాడ సెంట్రల్లోనూ ఇదే జోరు కనిపిస్తోంది. ఇక్కడ చాలా వరకు టీడీపీకి మాస్ కేడర్ ఉంది. అయితే..గత ఎన్నికల తర్వాత.. స్థానిక ఎమ్మెల్యే వీరిని తనవైపు తిప్పుకొని లోకల్‌బాడీ ఎన్నికల్లో గెలిచారు.
ఇప్పుడు ఎన్నికలకు ముందు వీరిని టార్గెట్ చేసుకున్న బొండా ఉమా.. వారిని తిరిగి పార్టీలో చేర్పించుకుంటున్నారు. ఇంటికో జెండా పేరుతో మొగల్రాజపురంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు సక్సెస్ ఇస్తున్నాయి. తాజాగా.. నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలంలో ఏకంగా 200 మంది కార్యకర్తలు వచ్చి టీడీపీ కండువా కప్పుకొన్నారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 200 వైసీపీ కుటుంబాలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకట రెడ్డి ఆహ్వానించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వైసీపీపై భారీ దెబ్బ కొట్టేలా చాలా వ్యూహాత్మకంగా టీడీపీ వ్యవహరిస్తోంది.