నారా చంద్రబాబు నాయుడు…ఈ పేరు తెలియని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు…40 ఏళ్ల రాజకీయ జీవితం…14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం…దేశవ్యాప్తంగా విజనరీ లీడర్ల జాబితాలో నంబర్ వన్ గా నిలిచే లీడర్…తాత..తండ్రి..మనవడు..ఇలా ఏపీలో మూడు తరాల ఓటర్లనూ మెప్పించగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు. అందుకే, బాబు అంటే భరోసా అని ఆంధ్రాప్రజలు నమ్ముతారు. ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్ర రాజకీయ పుటల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న నవయుగ వైతాళికుడు బాబు.
ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చి సంస్కరణలతో, సంక్షేమ పథకాలతో, డెవలప్మెంట్ తో భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన దార్శనీకుడు ఆన. విజన్ 2020 అంటూ 20 ఏళ్ల క్రితమే బంగారు కలను కనడమే కాకుండా దానిని సాకారం చేసేందుకు ఎనలేని కృషి చేసిన మార్గదర్శి ఆయన. చంద్రబాబు గురించి ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు కరువవుతాయి….ఆయన గురించి రాసుకుంటూ పోతే అక్షరాలు అరువు తెచ్చుకోవాలి. ప్రపంచ పటంలో తెలుగోడి సత్తా చాటుతూ..తెలుగువారంతా గర్వపడేలా తనదైన ముద్ర వేసిన చంద్రబాబు జీవితం ఎందరికో ఆదర్శప్రాయం.
అటువంటి చంద్రబాబు జీవితంలోని కీలక ఘట్టాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంలోనే ఆయన బయోపిక్ ‘తెలుగోడు’ను తెరకెక్కించారు దర్శకుడు వెంకీ మేడసాని. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనే శీర్షిక ఉన్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రొడ్యూసర్ కూడా ఆయనే కావడం విశేషం. చంద్రబాబు పాత్రలో టాలీవుడ్ నటుడు వినోద్ అద్భుతంగా నటించారు. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. మల్లిక్ చంద్ర ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి రాజేష్ రాజ్ సంగీతం అందించారు. గురువారం నాడు యూట్యూబ్‌లో నేరుగా ఈ సినిమాను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది.
ఏమాత్రం సినీ అనుభవం లేని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ వెంకీ మేడసాని తన తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చంద్రబాబు జీవితాన్ని తమ కళ్ల ముందు ఆవిష్కరించిన వెంకీపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రబాబు పాలనలో ఆయన చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయని, ఆ అంశం తనను ఎక్కువ ఆకర్షించిందని వెంకీ అన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్ల నగరాలలో పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం గడుపుతున్నారని చెప్పారు. సమాజంలో వచ్చిన మార్పు కూడా డెవలప్మెంటేనని, సామాజిక అసమానతలు లేకుండా ప్రజలు జీవిస్తున్నారన్న పాయింట్ మీద సినిమా తీశానని చెప్పారు. అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశానని, చంద్రబాబు గారి ఆలోచనే ‘తెలుగోడు’ చిత్రం కాన్సెప్ట్ అని వెంకీ చెప్పారు.
ప్రపంచానికి ఏపీని పరిచయం చేసి దానిని గమ్యస్థానంగా మార్చాలన్న ఓ నాయకుడి తపనకు ప్రతిరూపమే ఈ చిత్రం అని అన్నారు. 5,6 నెలల క్రితం సినిమా తీయాలన్న ఉద్దేశ్యంతో కథ రెడీ చేసుకొని ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు, పెద్దలను కలిశానని, రాజకీయ నాయకుల మీద సినిమా విజయం సాధించదని వారు తనను వారించారని గుర్తు చేసుకున్నారు. కానీ, తనకు కథపై ఉన్న నమ్మకంతో తానే నిర్మాతగా మారి చిన్న ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీశానని అన్నారు. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ లో రిలీజ్ చేశామని అన్నారు.