ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఎస్ఈసీకి ప్రభుత్వం సహకరించాలని దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు స్వాగతించారు. ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ఉన్మాద పాలనకు సుప్రీం తీర్పు కనువిప్పు కావాలని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని, ప్రతి రాజ్యాంగ వ్యవస్థకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల ధ్వంసమే జగన్ సర్కార్ పనిగా పెట్టుకుందని నిప్పులు చెరిగారు. కోర్టుల జోక్యంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థలు నిలబడగలుగుతున్నాయని, ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు అన్నారు.
మరోవైపు, సుప్రీం తీర్పుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య విజయమని, ప్రతి పౌరుడూ రాజ్యాంగ బద్ధుడేనని ఆయన అన్నారు. పాలకుడైనా, పౌరుడైనా రాజ్యాంగాన్ని గౌరవించాలని, అతీత శక్తులుగా వ్యవహరిస్తే ఎదురుదెబ్బలు తప్పవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, జగన్ కోసం పనిచేస్తే రాజ్యాంగం చేతుల్లో చెప్పుదెబ్బలే రివార్డులని అన్నారు. సుప్రీంకోర్టుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ పట్ల జగన్ అహంభావపూరితంగా వ్యవహరించారని, సుప్రీంకోర్టు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని,ఎన్నికల విధుల్లో ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. కేంద్ర బలగాల పహారాలో పంచాయతీ ఎన్నికలు జరగాలని, ఈ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు.