టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ నేతల దాడిని టీడీపీ నాయకులు ముక్తకంఠంతో ఖండిం చారు. ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేశారు. బాధ్యతా యుతమైన స్థానంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ దగ్గరుండి వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు కాన్వాయ్ పైకి ఉసిగొల్పారన్నారు. ప్రతిపక్ష నేత కాన్వాయ్‌పై దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను టీడీపీ ధైర్యంగా ఎదుర్కొం టుందని తెలిపారు.
అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వైసీపీకి చెల్లిస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అదేసమయంలో వైసీపీ సర్కారు దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. మంత్రి చదువుకున్నారని.. అయినా.. ఏమాత్రం ఇంగిత జ్ఞానంలేకుండా వ్యవహరిం చారని నాయకులు ఫైరయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రాస్తారోకో నిర్వహించి.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
విజయనగరంలో రెండు గంటల పాటు బంద్ పాటించారు. అనంతపురంలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. అయితే.. రంజాన్ కావడంతో ఎక్కడా ముస్లింలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నుంచి సమాచారం రావడంతో నాయకులు కేవలం రెండు గంటల వరకే కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆమేరకు ముగించారు. పలువురు నాయకులు వైసీపీ పైనా మంత్రిపైనా విమర్శలు గుప్పించారు.
ఆదిమూలపు సురేష్ చర్యలు మాదిగ జాతికి తలవంపులు తెస్తున్నాయని మాజీ మంత్రి జవహర్ అన్నారు. సురేష్ ఏనాడైనా దళితుల గురించి పోరాడాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే కనీసం పట్టించుకోని సురేష్‌కు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అర్ధ నగ్న ప్రదర్శన చేయాల్సంది తాడేపల్లి ప్యాలెస్ ముందు అని పేర్కొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం పోయినపుడు చొక్కా విప్పితే బాగుండేదన్నారు.