ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందని ఎద్దేవా చేశారు. తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠాగా సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అని సెటైర్లు వేశారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ అని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
“జగన్ కు, తనకు మధ్య 2019లో ఒప్పందం కుదిరిందని షర్మిల చెబుతున్నారు. ఆస్తుల పంపంకం విషయమై ఎంవోయూ జరిగిందని షర్మిల అంటున్నారు. కానీ జగన్ ఆ ఒప్పందానికి కట్టుబడకుండా తనపైనా, తల్లిపైనా కేసు పెట్టినట్టు ఆమె ఆరోపిస్తున్నారు. మరి, చంద్రబాబు సమక్షంలో జగన్, షర్మిల మధ్య ఎంవోయూ జరిగిందా? జగన్, షర్మిల కుటుంబ వ్యవహారాలో చంద్రబాబుకు ఏం సంబంధం? లేకపోతే, జగన్ తో చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేయించారా? మీ నాయకుడు ఎవరికి చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు? సొంత తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చి రచ్చ చేసింది మీ నాయకుడే! పైగా… ఇది చాలా చిన్న విషయం… ఘర్ ఘర్ కీ కహానీ అని జగన్ చెప్పారు. మీరు చేసే తప్పుడు పనులను అందరికీ ఆపాదించే ప్రయత్నం చేయొద్దు” అని పట్టాభి విమర్శించారు.