ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు ఘటన వ్యవహారం సద్దుమణగక ముందే….తాజాగా విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరిగింది. దాదాపు 10 మంది దుండగులు పట్టాభిపై పక్కాగా స్కెచ్ వేసి దాడికి పాల్పడ్డారు. పట్టాభి ఇంటి నుంచి బయటకు వస్తారని తెలుసుకున్న దుండగులు రెక్కీ నిర్వహించి పక్కా పథకం ప్రకారం దాడి చేశారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో ఈ వ్యవహారం బయటపడింది. మొదట ముగ్గురు వ్యక్తులు పట్టాభిపై దాడి చేయగా…తర్వాత ఇంకో వ్యక్తి రాళ్లతో కారుపై దాడి చేశాడు. దుండగులంతా ద్విచక్రవాహనాలపై అక్కడ మాటు వేసి..దాడి చేసి పారిపోయారు. కారుపై దాడి చేయడంతో అందులో ఉన్న పట్టాభికి కూడా గాయాలయ్యాయి. ఆయన సెల్ ఫోన్ కూడా ధ్వంసమయింది.
దుండగులు రాడ్లతో దాడి చేశారని, తన డ్రైవర్ను కూడా వారు గాయపరిచారని తెలిపారు. దాడులు చేసినప్పటికీ, భయపడనని, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని పట్టాభి చెప్పారు. 6 నెలల క్రితం కూడా తన కారుపై దాడి జరిగిందని, అయినప్పటికీ ఆ దాడిపై ఇప్పటికీ చర్యలు లేవని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలను బయటపెడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని పట్టాభి ఆరోపించారు. హైకోర్టు జడ్జిలు, ప్రముఖులు ఉండే ప్రాంతంలో తనపై దాడి జరిగిందని, ఏపీలో శాంతిభద్రతలు దిగజారాయని, వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనపై దాడి ఘటనలో మంత్రి కొడాలి నాని హస్తం ఉందని పట్టాభిరామ్ అనుమానం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలిపినా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.అధికార పార్టీకి పోలీస్ వ్యవస్థ లొంగిపోయి పని చేస్తోందని పట్టాభి ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్ కు చెపుతున్నానని పట్టాభి అన్నారు.