సంపూర్ణ మద్యపానం అంటూ హామీ ఇచ్చి సీఎం పదవి చేపట్టిన జగన్…సీఎం అయిన తర్వాత మాత్రం రాష్ట్రంలో కల్తీ, నకిలీ మద్యం ఏరులై పారేలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతలతో చీప్ క్వాలిటీ లిక్కర్ ను అధిక ధరలకు అమ్ముతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అదాన్ డిస్టిలరీ ముమ్మాటికీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి బినామీలదేనని ఆరోపిస్తున్నారు. ఈ కోవలోనే టీడీపీ ఒత్తిడితోనే వైసీపీ నేతలకు చెందిన ఆదాన్ డిస్టిలరీల డైరెక్టర్లు మార్చారని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి అల్లుడు పిన్నాక రోహిత్‌రెడ్డి, జగన్‌రెడ్డి కుటుంబ సభ్యుడు ముప్పిడి అనిరుధ్‌రెడ్డిలు ఆ కంపెనీకి పాత డైరెక్టర్లని, వారిద్దరూ ఎవరింట్లో వంటవాళ్లో సాయిరెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 డిసెంబర్ 02న ప్రారంభమైన ఆదాన్ డిస్టిలరీస్ రెండున్నరేళ్ల కాలంలోనే సుమారు రూ.2,400కోట్లు టర్నోవర్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఇది రూ.3,000కోట్లు దాటినా ఆశ్చర్యం అక్కర్లేదని, గతంలో దానికి డైరెక్టర్లుగా పిన్నాక.రోహిత్ రెడ్డి, ముప్పిడి అనిరుధ్ రెడ్డిలు ఉన్నారని, టీడీపీ నేతలు విమర్శించడంతో వారి స్థానంలో శ్రీనివాస్ కాశిచాయానుల, బోలారం శివకుమార్ లు వచ్చారని అన్నారు.
1100 అడుగుల విస్తీర్ణ స్థలంలో రూ.3వేలకోట్ల కంపెనీ ఎలా సాధ్యమని రమణారెడ్డి ప్రశ్నించారు. 106 బ్రాండ్లను 2019 అక్టోబర్ నుండి 2020 ఫిబ్రవరి మధ్య తీసుకొచ్చారని, దీనికి సారాయిరెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా అని ప్రశ్నించారు టీడీపీ హయాంలో అమ్మిన మద్యం బ్రాండ్లు అంతర్జాతీయంగా ఉన్నాయని, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఇపుడు ఏపీలో ఉన్నాయని విమర్శించారు.
ప్రపంచంలో ఎవరికీ రాని ఆలోచన జగన్ కు వచ్చిందని, ఆఖరికి శ్రీలంక కూడా మద్యం అమ్మకాలపై అప్పులు తేలేదని ఎద్దేవా చేశారు. రెండేళ్ల తర్వాత జగన్ బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటారో, తాడేల్లి ప్యాలెస్ లో ఉంటారో తెలీదని,కానీ, రాష్ట్రంపై మాత్రం వేల కోట్ల అప్పుల భారం ఉంటుందని అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి కూడా ఏపీని అప్పుల బారీ నుండి కాపాడాలని, ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి వివరించాలని రిక్వెస్ట్ చేశారు. మద్యం కుంభకోణంలో జగన్, సాయిరెడ్డిల పాత్ర ఉందని, వారికి జైలు యాత్ర తప్పదని ఆనం జోస్యం చెప్పారు.
వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ వింటూ ఊరుకోదని, సమాధానం చెప్పితీరుతుందని తెలుగుదేశం నేత ఆనం వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. చేతిలో సీఐడీని పెట్టుకుని కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని మరింత ఉద్యమిస్తామని అన్నారు. pic.twitter.com/L7hLEOtenR
— Telugu Desam Party (@JaiTDP) July 25, 2022