టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. హాట్ హాట్‌గా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు సహా.. ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారశైలిపై సమావేశం.. చర్చించింది. ఈ క్రమంలో కృష్ణా జల వివాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ నాటకం ఆడుతున్నారని నేతలు మండిపడ్డారు. నీటి సమస్యపై ఇద్దరివీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని మండిపడ్డారు. జల వివాదాలపై ఇద్దరు సీఎంలు కుమ్మక్కై.. రాత్రి ఫోన్లో మాట్లాడుకుని ఉదయం సవాళ్లు విసురుకుంటున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు నిప్పులు చెరిగారు.
జల వివాదాలపై చంద్రబాబు స్పందించటం లేదనటం సరికాదన్నారు. రాష్ట్రానికి సీఎం జగనా? లేక చంద్రబాబా? అని నిలదీశారు.
జలవివాదాలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు? ఈ వివాదంపై ఇద్దరు సీఎంలు చర్చించుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది? రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఎందుకు బలమైన వాదనలు వినిపించలేదు? లేఖలు రాస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? ప్రజోపయోగ కార్యక్రమాలు ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఉపాధిహామీ బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఉపాధి పనులు చేసినవాళ్లు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాలా? కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ప్రభుత్వం అమలు చేయట్లేదు. అని ప్రశ్నించారు.
లేని వివాదాన్ని కావాలని సృష్టించి ఇద్దరు ముఖ్యమంత్రులు నటిస్తున్నారని కాలవ దుయ్యబట్టారు. సున్నితమైన అంశాన్ని సుహృద్భావ వాతావరణంలో ఎందుకు చర్చించుకోవట్లేదని నిలదీశారు. ప్రజల్ని మోసగించే చర్యలకు స్వస్తి పలికి రెండు రాష్ట్రాల మధ్య నెలకొల్పిన కృత్రిమ వివాదాలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేశారు. లేని వివాదాన్ని కావాలని సృష్టించి ఇద్దరు సీఎంలు ఆయా ప్రాంతాల రక్షకులుగా నటిస్తున్నారని పొలిట్ బ్యూరో భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. సున్నితమైన అంశాన్ని సుహృద్భావ వాతావరణంలో ఎందుకు చర్చించుకోవట్లేదన్నారు. నీటి సమస్యపై ఇద్దరు సీఎంలకు వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప రాష్ట్రాల ప్రయోజనాలు లేవన్నారు.