కాస్త జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశం ఓటమికి కారణం జగన్ అని చెప్పడం కంటే కూడా చాలా విషయాల్లో తెలుగుదేశం పాటించిన మౌనమే అని అనిపిస్తుంది. తెలుగుదేశం కార్యకర్తల బలహీనత వారి సెన్సిబులిటీ అని అర్థం చేసుకున్న వైకాపా తాను బరితెగించి విజయాన్ని దక్కించుకుంది. దీనికి ఒక పెద్ద ఉదాహరణ కోర్టులు- స్టేలు.
చంద్రబాబుపైన వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు అనేక మంది కేసులు వేశారు. చాలా కేసులు తదనంతరకాలంలో వారే స్వయంగా ఉపసంహరించుకున్నారు. అలా ఉపసంహరించుకున్నవి, తీర్పులు చంద్రబాబుకు అనుకూలంగా వచ్చినవి పోను చంద్రబాబుపై నికరంగా ఉన్న కేసులు రెండో మూడో మాత్రమే.
ఇది తెలుగుదేశంలో అందరికీ తెలుసు. కానీ ఒకవైపు సోషల్ మీడియాలో, బహిరంగ వేదికలపై టీవీ ఛానెళ్లలో వైకాపా నాయకులు చంద్రబాబుపై 19 స్టేలు ఉన్నాయంటూ ఆధారాలు లేకుండా అబద్ధం చెబుతుంటే ఏనాడు చంద్రబాబు, లోకేష్ అధికారంలో ఉన్నపుడు ఖండించలేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా గట్టిగా దీనికి కౌంటర్ ఇవ్వలేదు.
ఈ మధ్యనే పట్టాభిరామ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై ఉన్నది మూడు కేసులే… జగన్ పై ఉన్న కేసులు మాత్రం వందల్లో ఉన్నాయి. వాటి జాబితాను ప్రింట్ తీసి పరుస్తూ పోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయ వరకు అవుతాయి అన్నారు. పదేపదే వైకాపా చెబుతున్న అబద్ధానికి 19 స్టేలు ఉన్నట్టు నిరూపిస్తే మొత్తం రాజీనామా చేస్తాం, లేకపోతే మీరు మీ పదవులను వదులుకుంటారా అని ఏనాడూ ఛాలెంజ్ చేయలేదు టీడీపీ.
దీంతో జనం వైకాపా చెప్పే అబద్ధాన్ని నమ్మేశారు. అలాగే జగన్ అండ్ పార్టీ సభ్యులు అనేక విషయాలపై టీడీపీపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నా సరైన కౌంటర్ ఇవ్వకుండా, వాటిని ఖండించకుండా టీడీపీ పాటించిన మౌనమే ఈరోజు టీడీపీని చావుదెబ్బకొట్టింది.
గతంలో వైకాపా చెప్పిన ఏ అబద్ధాన్ని సరిగ్గా టీడీపీ ఖండించలేకపోవడం వల్లే ఈరోజు రాజకీయంగా ఎంతో నష్టపోయింది. అన్నీ తెగించిన వారి చేతికి పవర్ ఒక్కసారి వస్తే ఎంత ప్రమాదకరమో ఇపుడయినా టీడీపీ అర్థం చేసుకుందో లేదో మరి.