టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు (102) తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో కన్నుమూశారు. సంగం డెయికీకీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన యడ్లపాటి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఆంధ్రరాష్ట్రానికి సేవలందించారు. యడ్లపాటి వెంకట్రావు మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
యడ్లపాటి రాజకీయ జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో యడ్లపాటి రాష్ట్ర మంత్రిగా, జడ్పీ చైర్మన్గా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారని, చేపట్టిన ప్రతిపదవికి వన్నెతెచ్చారని కితాబిచ్చారు. యడ్లపాటి జీవితం ప్రతీ తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు. యడ్లపాటితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన చంద్రబాబు…వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరపున, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వేమూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి యడ్లపాటి విజయం సాధించారు. 1978-80 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. యడ్లపాటి మృతి పట్ట పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.