ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు శతవిధలా ప్రయత్నించడం సహజం. అయితే, ఈ సారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ గెలుపే పరమావధిగా అనేక అడ్డదారులు తొక్కిందన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ ఎన్నికలో గెలుపు కోసం వైసీపీ చేసిన అరాచకం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయనను జగన్ సర్కార్ అరెస్టు చేయించింది.
వైసీపీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయించాలంటూ టెక్కలి వైసీపీ ఇన్ చార్జ్ దువ్వాడ శ్రీనివాస్…. వాలంటీర్లను బెదిరింపులకు గురిచేశారన్న ఆరోపణల వైనం విమర్శలపాలైంది. ఇక, నిమ్మాడలో తన అనుచరులు, ఆయుధాలతో దువ్వాడ వీరంగం వేసినా….కనీసం పోలీసుల నుంచి మందలింపు కూడా లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇలా, అధికార పార్టీ తన అంగబలం, అర్ధబలం…అన్ని బలాలు ఉపయోగించినప్పటికీ….అంతిమంగా ప్రజాకోర్టులో న్యాయమే గెలిచింది.
నిమ్మాడలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి, అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్ కుమారుడు కింజరాపు సురేష్ 1700 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. న్యాయానిదే అంతిమ విజయమని సురేష్ మరోసారి నిరూపించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థి అప్పన్నకు కేవలం 157 ఓట్లు పోల్ కావడం విశేషం. అచ్చెన్న విడుదల అయిన రోజే వచ్చిన ఈ విజయంతో నిమ్మాడలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
40 ఏళ్లుగా నిమ్మాడ టీడీపీకి కంచుకోటగా నిలిచింది. అయితే, ఆ కంచుకోటను బద్దలు కొట్టాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ, అచ్చెన్న సొంత ఇలాకాలో వైసీపీ పాగా వేయలేకపోయింది. సింహాన్ని బంధించి ఎన్నికలు జరపాలనుకుంటున్నారని, అచ్చెన్న ఉన్నా లేకపోయినా నిమ్మాడ ప్రజలు ఆయన వెంటే ఉన్నారని ఈ గెలుపు మరోసారి నిరూపించింది. తన గెలుపుపై నిమ్మాడ సర్పంచ్ కింజరాపు సురేష్ స్పందించారు.
ఈ గెలుపుతో తమ కుటుంబంపై నిమ్మాడ ప్రజలు మరింత బాధ్యతను పెంచారని అన్నారు. ఎర్రన్న ఆశీస్సులు, అచ్చెన్న,రామ్మోహన్ నాయుడు సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరింస్తానని చెప్పారు. నిమ్మాడ ఎన్నికల్లో పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారని, కింజరాపు కుటుంబం మొత్తాన్ని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. వైసీపీకి నిమ్మాడ ఎన్నిక చెంపపెట్టు అని అన్నారు. మరి, నిమ్మాడ గెలుపుతోనైనా వైసీపీ నేతలు బెదిరింపులకు స్వస్తి పలికితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.