క్యాటరాక్ట్ ఆపరేషన్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు గత నెల రోజులుగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాస్త కోలుకున్న చంద్రబాబు తాజాగా సతీసమేతంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి శుక్రవారం ఉదయం తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు దంపతులకు రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. వారితో పాటు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం తన భర్త పక్కన లేకుండానే స్వామి వారిని దర్శించుకున్నానని, ఈ రోజు ఇద్దరం కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నామని అన్నారు. తన బాధలకు, తన ప్రార్థనలకు స్వామి వారి నుంచి సమాధానం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇక, హిందూ భక్తులు పవిత్రంగా చూసే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో నాణ్యత తగ్గిపోయిందని టీడీపీ యువనేత నారా లోకేష్ ఆరోపించారు. ఆ విషయంపై ఎన్నో ఫిర్యాదులు వింటున్నామని, దైవ ప్రసాదం అసలు నాణ్యతను 2024 ఏప్రిల్ లో తాము స్వాధీనం చేసుకున్న తర్వాత చూపిస్తామని,. లడ్డూ నాణ్యతలో తేడాను మీరు గమనిస్తారని అన్నారు.
ఇక, దర్శనం అనంతరం తిరుమల నుంచి అమరావతిలోని తన నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఈ రోజు సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.