ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ సాయంత్రం 7.15 గంటలకు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు 30మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ మేరకు తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేబినెట్లో చోటు దక్కింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి కేంద్రమంత్రి పదవులు దక్కాయి. కేంద్రమంత్రివర్గ కూర్పుపై దాదాపు 9 గంటల పాటు ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్తో చర్చించారు. మిత్రపక్షాల్లో ఎవరికెన్ని శాఖలు కేటాయించాలన్న విషయంపై స్పష్టత వచ్చింది.
మిత్రపక్షాల్లో కేబినెట్ బెర్త్ ఇచ్చే విషయంలో ప్రధాని మోదీ 5 కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. రెండు, మూడు ఎంపీలు ఉన్నవారికి ఒక సహాయ మంత్రి పదవి దక్కనుంది.
ఈ లెక్కన తెలుగుదేశం, జేడీయూ, శివసేన -షిండే వర్గం, లోక్ జనశక్తి – పాశ్వాన్ పార్టీలకు కేబినెట్ పదవులు, అలాగే మిత్రపక్షాల్లో భాగస్వాములైన కుమారస్వామి, ప్రతాప్ జాదవ్ కు పదవులు దక్కనున్నాయి. అయితే ఎవరికి ఏ శాఖలు వరించాయన్న దానిపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది.