విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని కొంతకాలంగా పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన తమ్ముడు కేశినేని చిన్నికి పార్టీలో ప్రాధాన్యత పెరిగిందని పాల్గొంటున్నారని నాని గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తిరువూరు టిడిపి కార్యాలయంలో సమన్వయ భేటీ సందర్భంగా ఈ అన్నదమ్ముల మధ్య రచ్చ రోడ్డు కెక్కింది. ఈ ఇద్దరు నేతల అనుచరులు బాహబాహికి దిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్న వైనం సంచలనం రేపింది.
ఈ నెల 7న చంద్రబాబు తిరువూరు పర్యటన సందర్భంగా నిర్వహించదలచిన సమావేశానికి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఆ ఫ్లెక్సీలలో నాని ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని అక్కడకు 100 బైకులతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలోనే చిన్ని ఫ్లెక్సీలను నాని అనుచరులు చింపివేశారు. అయితే, అందులో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండడంతో సమావేశానికి వచ్చిన జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 1000 మందితో చిన్ని అక్కడకు వచ్చారు. దీంతో, నాని, చిన్ని వర్గాల మధ్య గొడవ ముదిరి ఇద్దరి అనుచరులు కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులలో ఓ ఎస్సై తలకు తీవ్ర గాయమయ్యి రక్తస్రావం అయింది.
ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంతకాలంగా వేరు కుంపటి నడుస్తోందని, దానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని అన్నారు. ఇటువంటి గొడవలు జరుగుతాయనే తాను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు. తిరువూరు టిడిపి ఇన్చార్జి దేవదత్ పూజకు పనికిరాని పువ్వు అని గతంలోనే చంద్రబాబుకి చెప్పానని అన్నారు.
ఇక, కేశినేని చిన్నికి పార్టీతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. అతడేమైనా ఎంపీనా? ఎమ్మెల్యేనా? అని నిలదీశారు. పార్టీ కేడర్ మనోభావాలు దెబ్బతీసేలా దేవదత్ వ్యవహరించారని, అందుకే తన కేడర్ నుంచి రియాక్షన్ వచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు బాధ్యతలు అప్పగించారని కొంతమంది వ్యక్తులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను 2 సార్లు ఎంపీగా గెలిచానని, రతన్ టాటా స్థాయి వ్యక్తిని తాను అని నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. బెజవాడ పేరు చెడగొట్టకూడదనే ఇన్నాళ్లూ ఓపిక పట్టానని, రాబోయే పరిణామాలు దేవుడు, ప్రజలే చూసుకుంటారని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
గతంలో టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు తనను గొట్టం గాడని తిట్టినా భరించానని, పార్టీ కోసం, చంద్రబాబు కోసం ఓపిక పడుతున్నానని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలోనూ చాలా అవమానాలు పడ్డానని, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఓ వ్యక్తి తనను చెప్పు తీసుకొని కొడతా అని వ్యాఖ్యానించాడని, తనను క్యారెక్టర్ లెస్ అన్న ఆ వ్యక్తి మాటలపై పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఏనాడు వర్గాలను ప్రోత్సహించలేదని అన్నారు.
ఇక, తిరువూరు ఘటనపై కేశినేని చిన్ని కూడా స్పందించారు. తిరువూరు ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని చిన్ని అన్నారు. ఈ గొడవ వ్యవహారం గురించి అధిష్టానమే చూసుకుంటుందని చిన్ని చెప్పారు.