టీడీపీ కీలక నేతల్లో ఒకరైన ఎంపీ కేశినేని నాని కొంతకాలంగా పార్టీపై అలకబూనిన సంగతి తెలిసిందే. బెజవాడ స్థానిక నాయకుల్లో కొంతమందికి, నానికి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే నాని…కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తన కార్యాలయం కేశినేని భవన్ పై టీడీపీ చిత్రపటం తీసేసి టాటా సంస్థల అధినేత రతన్ టాటా చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
దీంతో, కేశినేని పార్టీ మారబోతున్నారని, బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు, చంద్రబాబుతో నాని భేట అయ్యారని, ఇకపై తాను టీడీపీలో కొనసాగబోనని కూడా చెప్పినట్లు పుకార్లు వచ్చాయి. అయితే, ఈ పుకార్లను నాని అనుచరుడు, టీడీపీ మైనారిటీ నేత ఫతావుల్లా స్పష్టం చేశారు. టాటా ట్రస్టు, కేశినేని ట్రస్టులు కలిసి బెజవాడలో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్నామని, బెజవాడకు టాటా ట్రస్టు చేసిన సేవలకు గుర్తింపుగా టాటాతో నాని ఫొటోను ఏర్పాటు చేశామని వివరణనిచ్చారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా నాని 100 కార్లు, 150 బైకులతో భారీ ర్యాలీగా రావడంతో ఆ పుకార్లన్నీ పటాపంచలయ్యాయి. అంతేకాదు, జగన్ పై నాని విరుచుకుపడిన తీరుతో నాని టీడీపీ వెంటే ఉంటారని, పార్టీపై నాని అలకవీడారని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. దమ్ముంటే చూసుకుందాం రండి.. ఇక డైరెక్ట్ ఫైట్….టైమూ, డేటూ చెబితే మేం వచ్చేస్తాం.. ఒకేసారి తేల్చేసుకుందాం. రోజూ కొట్టుకుంటుంటే ఏపీకి చెడ్డపేరు వస్తుంది…అంటూ నాని చెప్పిన డైలాగులు టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపాయి.
పార్టీ కార్యాలయాలపై, నేతలపై దాడి జరిగిన నేపథ్యంలో చంద్రబాబు దీక్షకు నాని మద్దతు తెలపడంపై తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టసమయంలో ఉన్నపుడు అంతర్గత కలహాలు, అభిప్రాయ భేదాలను పక్కనబెట్టి నాని రావడంపై టీడీపీ కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు. టీడీపీ నేతలంతా కలసికట్టుగా ఉండ…జగన్ అరాచకపాలనకు చరమగీతం పాడాలని, అనంతపురం టీడీపీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలంతా విభేదాలను పక్కనబెట్టి ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.