గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోన్న సంగతి తెలిసిందే. ఖజానా ఖాళీ అయిన ఏపీ సర్కార్ అందినకాడికి అప్పులు చేస్తూ..ఆర్థిక శాఖ పరిమితులు కూడా దాటడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, కేంద్రానికి తెలియకుండా కార్పొరేషన్ల పేరు చెప్పి బ్యాంకుల దగ్గర జగన్ కోట్లాది రూపాయలు అప్పు తీసుకోవడంపై బీజేపీ పెద్దలు కూడా గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ చేసిన అప్పులు, తప్పులపై కేంద్రం ఆరా తీయడం కూడా మొదలుబెట్టింది.
అందుకోసం,జగన్ సర్కార్ చేస్తున్న అప్పులపై ప్రాథమిక స్థాయిలో వివరాలు సమర్పించాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ)కు కేంద్రం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్యసభ సాక్షిగా జగన్ అప్పుల తిప్పలను కేంద్రం బట్టబయలు చేసింది. జగన్ సర్కార్ భారీగా బడ్జెట్యేతర అప్పులు చేసినట్లు కేంద్రం ధృవీకరించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో జగన్ సర్కార్ గుట్టురట్టయింది.
జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనేే తాజాగా రాజ్య సభ సమావేశాల సందర్భంగానూ ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. కనకమేడల ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్పుల బండారం బయటపడింది. 2019 ఏప్రిల్ 1 నుంచి కార్పొరేషన్లు, కంపెనీల పేరుతో ఏపీ ప్రభుత్వం రూ. 56,076 కోట్లు అప్పుగా తీసుకుందని కేంద్రం వెల్లడించింది.
ఎస్బీఐ నుంచి ఏపీ సర్కార్ రూ.15,000 కోట్లకు పైగా అప్పు తీసుకొని ఆ బ్యాంక్ ను అప్పుల జాబితాలో మొదటిస్థానంలో నిలబెట్టింది. ఇక, బ్యాంక్ ఆఫ్ బరోడాకు జగన్ ప్రభుత్వం రూ. 9వేల కోట్లకు పైచిలుకు మొత్తం రుణపడింది. ఇక, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 7వేల కోట్లు, యూబీఐ నుంచి రూ. 6,800 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 5,700 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 4వేల కోట్లకుపైగా భారీ మొత్తాలను ఏపీ అప్పుగా తీసుకుంది. ఏపీలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు సైతం ఏపీ ప్రభుత్వం నానా పాట్లు పడుతోందన్న విపక్షాల విమర్శలకు కేంద్రం తాజా సమాధానం ఊతమిచ్చినట్లయింది.