అన్న వస్తున్నాడు….నిరుద్యోగులంతా ధైర్యంగా ఉండండి…ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ జగన్ 2019 ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. సీఎం అయిన తర్వాత తన మాటను అడ్డదిడ్డంగా తప్పిన జగన్…కేవలం ఒకే ఒకసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. 2.3 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్…10 వేల పోస్టులే భర్తీ చేసి నిరుద్యోగులను నీరుగార్చారని విపక్షాలు ఆనాడు విమర్శలు గుప్పించాయి. ఆ 10వేలలో ఐదు వేల పోస్టులు వైద్య ఆరోగ్య శాఖవేనని, మిగతా వాటిలో చాలా పోస్టులకు ప్రత్యేక అర్హతలు కావాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో 91 వేల పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జగన్ పై మరోసారి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ తీరుకు నిరసనగా టీడీపీ శాసనసభా పక్ష నేతలు అసెంబ్లీ దగ్గర నిరసనకు దిగారు. జాబులెక్కడ జగన్ రెడ్డి అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల్ని జగన్ రెడ్డి మోసాగించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఖాళీలను భర్తీ చేయాలని నినాదాలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది.
ఉద్యోగాల కల్పనలో తెలంగాణను చూసైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చురకలంటించారు. నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసాగించారని మండిపడ్డారు. సీఎం హామీ ఇచ్చినట్టు భర్తీ చేస్తామన్న 2.30 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబులు ఎక్కడ జగన్ రెడ్డి? అంటూ బ్యానర్ ను ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో నారా లోకేశ్, కింజారపు అచ్చన్నాయుడు, అశోక్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు.
మరోవైపు, అసెంబ్లీ ముట్టడికి యత్నించిన గిరిజనులను పోలీసులు అరెస్ట్ చేశారు. సేవాలాల్ మహరాజ్ జయంతి అధికారికంగా ప్రకటించాలని, బడ్జెట్లో గిరిజనులకు అన్యాయం జరిగిందని వారు నిరసనకు దిగారు.