టీడీపీ ఎమ్మెల్యేలు తమ పట్టును కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో.. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై టీడీపీ నాయకులు.. ఒకింత ఆగ్రహం.. ఆవేదనతో కూడిన తమ అభ్యర్థనను లేఖ రూపంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ లేఖలో వెలిగొండ పరిస్థితిని వారు వివరించారు. విభజన చట్టంలో దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇది లేకపోతే.. తమ జిల్లా ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోకి జారుకుంటారో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కళ్లకు కట్టారు.
అయితే.. దీనిపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందనే విషయం వరకు వారు ఎదురు చూడలేదు. వెంటనే కేంద్రం వద్దకు వెళ్లారు. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదన్నారు. తక్షణమే అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గెజిట్‌లో చేర్చాలని కోరారు. ప్రకాశం జిల్లాలో కరువు, ప్రజల ఇబ్బందులు, తాగు, సాగు నీటి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యలపై మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావు, ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, బీఎన్. విజయ్‌కుమార్, ముత్తముల అశోక్ రెడ్డి, నేతలు గూడూరి ఎరిక్షన్ బాబు, దామచర్ల సత్య తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు..వెలిగొండ ప్రాజెక్టు సమస్యపై వీడియో సీడీని షెకావత్ కు ఇచ్చారు.
వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితి, ప్రాజెక్టు ప్రాధాన్యతను నేతలు కేంద్రమంత్రికి వివరించారు. ఈ పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఏదైనా విషయాన్ని లేవనెత్తడం.. అక్కడితో మరిచిపోవడం అనేది ఇటీవల కాలంలో సహజంగా మారిపోయిన పరిణామం. కానీ.. దీనికి భిన్నంగా టీడీపీ వ్యవహరించడం.. బాగుందనే భావన వ్యక్తమవుతోంది.