పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కల్తీ సారా తాగి 15 మంది వరకూ చనిపోయారు. కానీ, కేవలం ఐదుగురే చనిపోయారని, ఆ మరణాలకు ప్రభుత్వానికీ సంబంధం లేదని వైద్యశాఖ మంత్రి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఇదంతా ప్రభుత్వం బాధ్యతా రాహిత్యమేనని ,ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు నిరసనగా వచ్చారు. నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్వర్యంలో టీడీపీ నేతలంతా సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి శాసనసభ వరకు ఖాళీ మద్యం సీసాలు, ప్లకార్డులతో వచ్చి నిరసన తెలిపారు. జగన్ మోసం ఖరీదు 25 ప్రాణాలు అని నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే అని, రాష్ట్రంలోని నకిలీ మద్యం బ్రాండ్ల భాగోతాన్ని బట్టబయలు చేస్తామని అన్నారు. ఆ కల్తీ సారా మరణాలకు జగన్ రెడ్డి బాధ్యత వహించాలని, మద్యపాన నిషేధంపేరుతో కొత్త కొత్త బ్రాండ్లను ఏపీకి తీసుకొచ్చిన ఘనత జగన్‌దేనని లోకేష్ ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై విచారణ చేపట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ పాలనలో కల్తీ మద్యం బ్రాండ్లు, కల్తీ సారా వల్ల వందలాది మంది చనిపోయి ఉంటారని ఆరోపించారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు టీడీపీ నేతలు. సారా బాటిళ్లతో టీడీపీ నేతల ర్యాలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.