అమరావతి రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతన్నల ఉద్యమాన్ని సైతం వైసీపీ నేతలు అవహేళన చేసిన వైనం తెలిసిందే. ఇక, గురివిందకు దాని నలుపు తెలీదన్నట్టు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం…అక్కడ యథేచ్ఛగా భూధందాలకు పాల్పడుతోందన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు, విశాఖలో ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని అక్కడ ఇన్ చార్జ్ గా నియమించారని ప్రచారం జరిగింది. విజయసాయి తనదైన రీతిలో అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ తరహాలో (ఆడిటర్) ట్రేడింగ్ జరిపారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యారోపణలకు దిగిన విజయసాయి…టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో విలువైన 300 ఎకరాలకు పైగా భూములను వెలగపూడి ఆక్రమించుకున్నారని విజయసాయి ఆరోపించచారు.
అయితే, తాను రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నానని, తనపై విజయసాయి చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని వెలగపూడి సవాల్ విసిరారు. తాను విశ్వసించే షిరిడి సాయిబాబాపై ప్రమాణం చేసి విచారణ చేపడితే, ఎటువంటి చర్యలకైనా తాను సిద్ధమని సవాల్ చేశారు. ఆర్థిక నేరాల్లో ఆరితేరిన వ్యక్తి, సూట్కేస్ కంపెనీల అధినేత, ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి.. తన చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. తన పేరిట, తన బంధువుల పేరిట అంగుళం భూమి ఉన్నట్టు నిరూపించినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని విజయసాయికి సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి నిరూపించ లేకుంటే పదవీ కాలం ముగిసే వరకు ఎంపీగా కొనసాగవచ్చని వెలగపూడి ఆఫర్ ఇచ్చారు.
తనకు బినామీల పేరిట ఆస్తులుంటే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పెట్టవచ్చని సూచించారు. అయితే, ఆ భూములను వైసీపీ నేతలకు కబ్జా చేయవద్దని వెలగపూడి అభ్యర్థించారు. దీంతో, ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. వెలగపూడి సవాల్ పై విజయసాయి స్పందించారు. విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ దేవుడితోపాటు వంగవీటి మీద అయినా ప్రమాణం చేయగలడని విజయసాయి విమర్శించారు. తన భార్యాపిల్లల మీద అయినా ప్రమాణం చేయగలడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బినామీ భూములు లేకపోతే వెలగపూడి ఎందుకు ఉలిక్కిపడుతున్నారని విజయసాయి ప్రశ్నించారు.