ఏపీ ప్రభుత్వ అసంబద్ధ విధానాలకు నిరసనగా విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ సభ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సభకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తోపాటు పలువురు బీజేపీ నాయకులు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సభపై టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. ఈ సభ ఓ బూటకమన్న పయ్యావుల…ఇది జగన్ అనుగ్రహ సభ అంటూ ఎద్దేవా చేశారు.
నిన్న ఓ బీజేపీ ఎంపీ మాట్లాడుతూ…ఏపీలో జగన్ సర్కార్ రాజకీయాలను కేంద్రం టెలిస్కోప్ లో చూస్తోందని వ్యాఖ్యానించడంపై పయ్యావుల సెటైర్లు వేశారు. ఏపీలో ప్రభుత్వ అరాచకం సినిమాస్కోపులో కనబడుతోంటే, కేంద్రం టెలిస్కోప్ లో చూస్తోందని చెప్పడంపై పయ్యావుల చురకలంటించారు. అన్ని రంగాల్లో అరాచకం రాజ్యమేలుతోందని, సామాన్యుల కష్టాలు..కళ్ల ముందు కనబడుతోంటే బీజేపీ టెలిస్కోప్ వేస్తానంటోందని మండిపడ్డారు.
ఏడాది క్రితం ఏపీలో పర్యటించిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా ఏపీలో గూండా రాజ్యం నడుస్తోందంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని పయ్యావుల గుర్తు చేశారు. అయితే, మొన్న తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షా చెప్పేవరకు ఏపీలో సర్కార్ కు భారతీయ జగన్ పార్టీ మద్దతుగా నిలిచిందని ఏపీ బీజేపీపై సెటైర్లు వేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు యుద్ధం చేయలేని సైన్యాధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. 2024 తర్వాత రాజకీయాలు చేయనన్న సోము వీర్రాజుకు ఏపీ రాజకీయాలపై చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు.
ఏపీలో బీజేపీ ఆందోళన అతిపెద్ద జోక్ అని , అమిత్ షా చెప్పాకే అమరావతి ఉద్యమానికి బీజేపీ నేతల మద్దతిచ్చారని గుర్తు చేశారు. మోడీ, అమిత్ షా నియంత్రణలో ఏపీ బీజేపీ లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో చీమచిటుక్కుమన్నా కేంద్రం సీరియస్గా స్పందిస్తోందని.. ఏపీలో ప్రాణాలు పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని పయ్యావుల నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఆరాచకాలపై ఏపీ బీజేపీ మౌనంగా ఉందని, ఏపీ బీజేపీ నేతల తీరు అనుమానస్పదంగా ఉందని ఆరోపించారు. జగన్ నెట్వర్క్లో ఏపీ బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. ప్రజల పక్షానే పోరాడే ఏకైక పార్టీ తెలుగుదేశమని, రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.