ఆంధ్రావని రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నది నందమూరి నట సింహం బాలయ్య మాత్రమే అన్నది నిర్వివాదాంశం. ఫర్ దిస్ దేర్ ఈజ్ నో సెకండ్ థాట్. రెండు సార్లు వరుస విజయాలు అందుకుని, గెలుపు బాటలో ఆయన హిందూపురం నియోజకవర్గాన అప్రతిహత రీతిలో దూసుకుపోతున్నారు. అంటే బయట కూడా బాలయ్య అన్ స్టాపబులే.
ముఖ్యంగా ప్రజా సమస్యలపై బాలయ్య గట్టిగా గళం వినిపిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లాకేంద్రంగా ఉంచుతూ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని పట్టుబడుతున్నారు. తన ప్రతిపాదనలో భాగంగా ఆయన ధర్మయుద్ధం చేస్తున్నారు.
తన డిమాండ్ సాధనకు అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెబుతున్నారు. అంతేకాదు తనదైన వేగంతో హిందూపురంలో ఉద్యమ కార్యాచరణను వామపక్షాలతో కలిసి నిర్వహిస్తున్నారు. మొన్నటి వేళ తన డిమాండ్ కు ఉన్న కారణాలేంటి, అందుకు ఊతం ఇస్తున్న పరిణామాలేంటి అన్నవి వివరిస్తూ అనంతపురం కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి,అనంతరం కలెక్టరేట్ కు చేరుకుని అఖిల పక్ష నేతలతో కలిసి వినతి పత్రం అందించి వచ్చారు.
హిందూపురం జిల్లా సాధనకు సీఎం జగన్ ను సైతం కలుస్తానని ప్రకటించారు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో బాలయ్య ఇమేజ్ ను అమాంతం పెంచేస్తున్నాయి. రియల్ కమ్యూనిస్టు ధోరణిలో బాలయ్య ఫైట్ చేస్తున్నారని ఆయన అభిమానులు, హిందూపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.